పుట:కాశీఖండము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 55

గాన మనకంటెఁ గడు మేలు కాశినుండు
కీటపక్షిసరీసృపక్రిమికులంబు. 46

సీ. కాశికానగరంబుకడసీమమున నున్న
చండాలుఁ బోలఁ డాఖండలుడు
నానందవనములో ననశనస్థితి నున్కి
భువనసామ్రాజ్యవైభవముఁ బోలు
నవిముక్తదేశస్థుఁ డయ్యె నేఁ బతితుండు
నశ్వమేధాధ్వరాహర్త దొరయు
వారణాసీసంభవం బైనమశకంబు
నైరావణముతోడి నవఘళించు
తే. నాటుకొని శ్రీమహాశ్మశానమున నున్న
యణుకనగ్నాలవటుఁ డైన నాగ్రహమున
గర్వితోద్ధతి నేతెంచు కాళరాత్రి
మృత్యుదేవతమునిపండ్లు మెఱుకఁ జాలు. 47

తే. ఎన్ని కల్పంబు లరిగిన నెడలిపోవ
దెంద రింద్రులు గడచిన నెలమి దప్ప
దెన్ని మన్వంతరంబులు చన్న నెపుడుఁ
బసిమి దప్పదు కాశికాపట్టణంబు. 48

ఉ. తత్తరపాటు లేక నదిఁ దాన మొనర్చి పినాకపాణి దే
వోత్తము విశ్వనాథుఁ గరుణోదధిఁ గమ్మనిపూవుగుత్తులన్
బత్తిరిఁ బూజ చేసి నుతిపాఠములన్ ఠవణించువారికిం
దొత్తులువోలె నుబ్బుదురు దొప్పలు దోరలు ముక్తికామినుల్. 49

సీ. ధర్మంబు కాశికాస్థానమధ్యంబున
నాల్గుపాదంబుల నడచి యాడు