పుట:కాశీఖండము.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 51

యోగపీఠారూఢ నుమబోటి నర్చించి
రభ్యర్హితులు సువర్ణాంబుజముల
నాడుంఠివిఘ్నేశు నాపూపమోదకా
ద్యుపహారములఁ దృప్తి నొందఁ జేసి
నవధరించిరి పురాణాఖ్యానముఖముల
సమధికం బగుమహాస్థానమహిమ
తే. వీటి పెద్దతలారి నిస్సాటికలికి
దిస్సమొలవేల్పు పార్వతీదేవిపట్టిఁ
గాలభైరవుఁ గుర్కురగణపరివృతు
ననుచరించిరి మునులు నాకౌకసులును. 38

వ. అనంతరంబ. 39

సీ. పంచాక్షరీమంత్రపారాయణమునకు
నెవ్వానిమానసం బేడుగడయు
దర్పోద్ధతు లగువాతాపికిల్వలునకు
వధశిలాస్థాన మెవ్వానికుక్షి
యాది నెవ్వానిదివ్యావతారమునకుఁ
బూర్ణాంబుకుంభంబు పురిటియిల్లు
మెఱసి లోపాముద్రమెఱుఁగుఁబాలిండ్లపై
బవళించు నెవ్వానిభవ్యమూర్తి
తే. కసరి యెవ్వానికంఠహుంకారరవము
కొండపాములకులములోఁ గూర్చె నహుషు
నట్టి పరమమహాశైవు నలఘుతేజు
వెదకి రానందవనములో విబుధమునులు. 40