పుట:కాశీఖండము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vii

యమే దీని ప్రత్యేకత తెలుపగలదు. కంచెర్ల శరభకవి (క్రీ. శ. 1500) యు మోచర్ల అన్నయు (క్రీ. శ. 1650, దీనిని ద్విపద కావ్యములుగ పరివర్తించిరి. కాని యవి లభ్యమగుట లేదు. దీనిని కర్ణాటాంధ్రభాషలలో వచనరూపముగ హాలాస్యమాహాత్మ్య కృతికర్త యగు నంజరాజు రచియించియున్నాడు. ఈవచనకాశీఖండము నముద్రితమైయున్నది. లాక్షణికులగు తాతంభట్టు, అప్పకవి కాశీఖండములోని లక్ష్యము లుదాహరించిరి. కూచిమంచి తిమ్మకవి తన సక్వలక్షణ సారసంగ్రహమున నిందలి పద్యములను డెబ్బదింటికి పైగా నుదాహరించియున్నాడు. ప్రామాణికాగ్రగణ్యుఁడగు పరవస్తు చిన్నయసూరి దీనియందలి పాఠభేదములను గుర్తించినాడు. భాషావిషయమున నీ గ్రంథ మెంతప్రమాణమో పై యుదాహృతులే తెలుపగలవు.

శ్రీనాథుఁడు సంస్కృతకాశీఖండమునందలి వ్యాసుఁడు కాశిని బాయుట అను వృత్తాంతమును గ్రహించి, దక్షిణకాశి యనఁదగిన దాక్షారామక్షేత్రమాహాత్యమును (భీమఖండము) రచించెను. అఖిలభారతవర్షప్రసిద్ధమగు కాశీక్షేత్రమహిమను దెలుపుగ్రంథమే స్కాందపురాణమున నున్నది. ఆగ్రంథవిషయమును గ్రహించి, ఆంధ్రదేశమున నూతనముగ వెలసిన దాక్షారామముయొక్క మాహాత్మ్యమును తెలుగులో రచించి, ఆవెనుక దానికి పురాణప్రామాణ్యమును మూలగ్రంథగౌరవమును నొసంగుటకు శ్రీనాథుఁడు తెలుగుగ్రంథమును యథామాతృకముగా