పుట:కాశీఖండము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi


కాశీఖండమున కాశీక్షేత్రమహిమయే చెప్పబడినను, అందందు సాముద్రిక, పాతంజలయోగశాస్త్ర, మంత్రశాస్త్ర విశేషములు పొందుపడినవి కావున నిది శ్రీనాథుని కవితాశైలికేగాక పాండితీప్రతిభకు నికషోపలము.

ఇందలిశైలి కావ్యశైలి గావున సంస్కృతాంధ్రసాహితీపారగుఁ డగు శ్రీనాథుఁడు, పూర్వకవుల రచనారీతుల నెట్లు జీర్ణించుకొన్నదనియు తెలిసికొనుటకు నీగ్రంథ మెంతేని యుపయోగపడును. సంస్కృతమున, మయూరుని సూర్యశతక శ్లోకానువాదములు ప్రధానస్థాన మాక్రమించును. వాల్మీకిరామాయణము, భవభూతియుత్తరరామచరిత్రము, విశాఖదత్తుని ముద్రారాక్షసము, భట్టగోపాలుని సాహిత్యచింతామణి (కావ్యప్రకాశికవ్యాఖ్య) అవతారికారచనముల కనువాదము లిందు గలవు. తెలుగున వేములవాడ భీమన యుద్దండలీల - నన్నయ భట్టారకుని యుభయవాక్ప్రౌఢి, తిక్కయజ్వ రసాభ్యుచితబంధము ప్రబంధపరమేశ్వరునిసూక్తివైచిత్రియు నిందుగలవు. ఇవియన్నియు ప్రత్యేకముగ జూపిన గ్రంథవిస్తరమగును. సూక్తముగను విశాలముగను బరిశీలించి శ్రీనాథమహాకవి రచనమున పదబంధములకు మూలములు మనము కనుగొనుట కవకాశములు గలవు.

కాశీఖండము శ్రీనాథుఁ డాంధ్రీకరించిన వెనుక వేఱెవ్వరును పద్యకావ్యముగ దీని నాంధ్రీకరింప దలపెట్టలేదు. ఈ విష