పుట:కాశీఖండము.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

325


బతియాజ్ఞ నిర్వహింపక కాని దేవతా
        ప్రమథులం దే నెట్లు ప్రభుతఁ గాంతు?
నొచ్చెంబు ధరియించి యొదిగి యుండక యెట్లు
        నిటలలోచనుమ్రోల నిలుచువాఁడఁ


తే.

గనలియున్నాఁడు నేఁ డెల్లి కాశివిరహ
వేదనాభారమున వేఁగి వేఁగి భర్గుఁ
డడ్డపడువారె యొరు లతఁ డలిగినపుడు?
గాన నిచటన కాలంబు గడపువాఁడు.

324


వ.

హరిశ్చంద్రశిబిదధీచిప్రముఖు లగుపెద్దలుం గాశీసంసేవనంబున సంసారదుఃఖంబులు ద్యజించి రని ప్రభావజ్ఞుం డగుభాస్కరుండు లోలార్కుం డన, నుత్తరార్కుం డన, సాంబాదిత్యుం డన, గరుడాదిత్యుం డన, మయూరాదిత్యుం డన, [1]ఖఖోల్కాదిత్యుం డన, వరుణాదిత్యుం డన, వృద్ధాదిత్యుం డన, కేశవాదిత్యుం డన, విమలాదిత్యుం డన, గంగాదిత్యుం డన, యామాదిత్యుం డనఁ బండ్రెండుమూర్తులు వహించి కాశీపురంబునం దధివసించె. కాశీవాసనిమిత్తంబు గా మనంబు లోలంబగుట లోలార్కుం డయ్యె. క్రమంబున నీ యాదిత్యులప్రభావం బభివర్ణించెద నాకర్ణింపుము.

325


ఉత్తరార్క ప్రభావవర్ణన

సీ.

కాశీపురికి నుత్తరాశాప్రదేశంబు
        నందు నుండుట నుత్తరార్కుఁ డయ్యె
నితిహాస మొకటి యయ్యినునిమాహాత్మ్యంబు
        సంప్రకాశ మొనర్పఁజాలెడునది

  1. ఘషోల్కా, ఖట్వా