పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు ఈసప్తసింధుదేశనివాసులే అనియు పైఋక్కులో స్పష్టముగా చెప్పబడినది.

శ్రుతి:- "ఇమైంద్ర భరతస్య పుత్రా అపపిత్వంచపితుర్న ప్రపిత్వం"|| ఇత్యాది (ఋగ్వే. 3-4-53-24)

తా|| తమతో యుద్ధమునకు తలపడుచున్న శత్రువుల నుద్దేశించి ఆర్యులు ఇంద్రుని ప్రార్థించు సందర్భమున "ఓ ఇంద్రుడా! ఈ భరతపుత్రులను చూడుము. వీరలు స్నేహమెన్న డెరుగరు గదా! సర్వదా శత్రుత్వమునే వహించి యున్నారు. (మాకు జ్ఞాతిసయదాయములో చేరినవారై యుండియు సహజ శత్రువుపై కేగురీతిగా గుర్రములను దఱుముచున్నారు. యుద్ధమునం దుపయోగించుటకు శర, శరాసన, చాపాదుల గొని పోవుచున్నారు. అని తమతో యుద్ధమునకు దలపడుచున్నవారు కూడ "భరతపుత్రుల"ని పై మంత్రమున స్పష్టముగా వినబడుచున్నది.)

శ్రుతి:- 'ఏతేన పాప్మానం ద్విషంతం భ్రాతృవ్యం హంతి తధోఏవవిజయతే.' (శతపధబ్రాహ్మణం 2-4-1-15)

తా|| ఈయజ్ఞకర్మ పాపులై మమ్ము ద్వేషించుచున్న యీజ్ఞాతిసముదాయమును చంపును. ఆవిధముగా జయము కలుగుగాక!

పైమంత్రములో ఆర్యులను ద్వేషించి వారితో యుద్ధములకు సిద్ధమగుచుండిన దస్యులు ఆర్యులకు జ్ఞాతిసముదాయములోని వారలే యని స్పష్టము చేసి యున్నది.

శ్రుతి:- "ఏతచ్ఛతఘ్నిం యజమానో భ్రాతృవ్యాయ ప్రహరతి||" (తై. సం. 1-5-7-6-2)

తా|| ఈ శతఘ్ని యను ఆయుధమును (అనగా ఒకేసారి నూరుమందిని చంపగల యుద్ధములో నుపయోగించు ఒక యంత్రము) మాకు జ్ఞాతులైన యీదస్యులను జంపుటకు యజ్ఞముచేయు యజమానునిచే ప్రయోగింపబడుచున్నది.