పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరస్వతీనదియు, సింధు వగయిరా పశ్చిమసముద్రములో కలియు నదులీ గాండ్వానాల్యాండు గుండా ప్రవహించి ఆఫ్రికాఖండముజొచ్చి లంకకు పశ్చిమముగా నిరక్షరేఖమీదగల 47* డిగ్రీ మొదలు ఏబదవ డిగ్రీలమధ్యగల పశ్చిమ సముద్రములో కలియుచుండెడివి. సరస్వతీనది హిమాలయములందు బుట్టి పశ్చిమసముద్రములో గలియు గొప్పనదిగా ఋగ్వేదమున వినబడుచున్నది. భారతవర్షము పశ్చిమోత్తరముగా పర్షియాకు తూర్పుసరిహద్దున గల "హీరటు" పట్టణమువఱకు వ్యాపించిఉండెడిది. పర్షియాలో పశ్చిమదక్షిణముగా గల "శాకస్థానము" (Seisthan) దానిచుట్టు గల ప్రదేశమంతటిని చేర్చుకొని ప్రాచీనభారతవర్ష భాగముగా నిరూపితమై యున్నది. ఎర్రసముద్ర మానాడు లేదు. అది భూభాగముగా ఉండెడిది. సహారా యెడారి (ఆనాడు సముద్రము) ఇవన్నియు ప్రాచీన భారతవర్షములో చేరియుండెడివి. (ఈగ్రంథకర్తచే వ్రాయబడిన బ్రహ్మాండసృష్టి విజ్ఞానమును చూడుడు.

అనులోమ విలోమ శాఖలు

చాతుర్వర్ణ్యస్థులైన ఆర్యులు ధర్మవిరుద్ధముగా నొకకులములోని స్త్రీపురుషులకు వేఱొక కులములోని స్త్రీపురుషులతో కామసంబంధము కలిగినందున అట్టివారికి కలిగిన సంతానమువలన అనులోమ విలోమ జాతు లనేకము లుత్పన్నమైనట్లు శాస్త్రము లుద్ఘోషించుచున్నవి. చాతుర్వర్ణ్య ధర్మములను కాపాడుటయే రాజధర్మములలో మొదటిది గాను, అతిముఖ్యమైనది గాను స్మృతులు శాసించుటవలన అట్టి సంకీర్ణ సంతానముల నెప్పటికప్పుడు వేరుబెట్టుచు వచ్చిరి. అందువలన సంకీర్ణవర్ణము లెచ్చుగా నైనవి. అందు విలోమసంకరమువలన కలిగినవారలు గ్రామములకుబయట నివసించునట్లు చేయబడుటచే బాహ్యజాతులని పిలువబడిరి. ఐతరేయబ్రాహ్మణమున వినబడుచుండిన బాహ్యజాతులగు ఆంధ్ర, పుండ్ర శబర, పుళింద, ముతిబా, మొదలగు సుమారు అరువది నాలు జాతు లిట్లేఏర్పడినవై యున్నవి. వారు పెద్దగుంపులుగా జేరుట కాకాలమున అవకాశములు లేవు. వారు భూములు మొదలగు ఆస్తులు