పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆర్యజాతీయుల వెంట నిడికొని బ్రహ్మావర్తాది ప్రదేశములనుండి యొక గొప్ప వలసను బయలుదేరదీసి సరస్వతీనదికి తూర్పుగా గంగానదివఱకు బోయి అచ్చటచ్చట ఆర్యనివాసముల నేర్పాటుచేసి యుండిరి. కాని అచ్చట "సదానీరా" అనెడి యొక నది అడ్డమురాగా ఆవలస నంతటితో నిలిపి అంతవఱకు వచ్చిన పొడుగునను, గ్రామముల, పట్టణముల నిర్మాణ మొనర్చిరి. సదానీరా నదికావల ప్రదేశము నివాసయోగ్యము కానందున దానిని నివాసయోగ్యముగా చేయుటకు తగిన యేర్పాట్లుచేసి తిరిగి పశ్చిమముగా వెళ్లి గంగా, యమునా, సరస్వతీ, దృషద్వతీ నదులను దాటి ఉపనదులతో గూడిన సింధునదిని దాటి పశ్చిమమున సింధునది కుపనది యగు 'కుభా' (అనగాకాబూలు నది) నదీతీరముల వఱకు తమ వలసలను విస్తరింప జేసి యుండిరి. ఈ వివరములు ఋగ్వేదముశతపథ బ్రాహ్మణము, మనుస్మృతి మొదలగు వానియందు సవిస్తరముగా వివరింపబడి యున్నవి.

"ఆర్యా: అత్ర ఆవర్తంతే పున: పున రుద్భవంతి ఇతి ఆర్యావర్త:." ఆర్యు లెచ్చట పుట్టి, పెరిగి, చచ్చి, తిరిగి పుట్టుచుందురో అది ఆర్యావర్త మని చెప్పబడుచున్నది. దీనిని బట్టి ఆర్యులు ఈప్రదేశమందుననే సృష్టి ప్రారంభము నుండి పుట్టి నివసించుచుండిరని మనుస్మృతి యందు స్పష్టము చేయబడినది. (పాశ్వాత్యు లూహించినటుల ఆర్యులు మధ్యాసియా యందు పుట్టి భారతవర్షమునకు వలస వచ్చిరనుట కేవలము వారి కల్పనయే గాని పూర్వచరిత్రలవలన ధ్రువపరచ బడినదికాదు.)

దక్షిణాపథము (ఆఱవ వలస)

అటుపిమ్మట ఆర్యుల దృష్టి వింధ్యపర్వతములకు దక్షిణముగా గల ప్రదేశములమీదకు ప్రసరించినది. ఆనాడు దక్షిణదేశమంతయు నిర్మానుష్యముగా నుండినది. ఆర్యులు 'సదా నీరా' ప్రాంతప్రదేశము నంతను మానవ నివాసమున కనుకూలముగా నొనర్చి పిమ్మట తూర్పున