పుట:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రహ్మర్షి దేశము (ప్రథమవలస)

అట్టి బ్రహ్మావర్త దేశమందు పుట్టి "ఆర్యులు" అనబడు మానవజాతి తాము జన్మించిన "బ్రహ్మావర్త" దేశము వదలి దానికి పశ్చిమమున గల ప్రదేశములందు నివసించి దానికి (మను 2-19) బ్రహ్మర్షి దేశమని పేరిడిరి. ఈవలసలను విశేషముగా మహాతపశ్శాలులైన బ్రహ్మర్షులు నడిపి వారలే వారి శిష్యప్రశిష్యులతో అచ్చట నివసించి యుండుటవలన దానికి బ్రహ్మర్షి దేశమనెడి నామము సార్థకమైనది. ఈప్రదేశమున ఇటీవల కురుక్షేత్రము, మత్స్య దేశము, పాంచాలము, శూరసేనము, ఉత్తరమధుర యనుపేర్లతో రాష్ట్రము లేర్పడినవి.

మధ్య దేశము (ద్వితీయవలస)

వింధ్యపర్వతము, హిమాలయపర్వతముల మధ్యయందు ప్రయాగకు (అలహాబాదు) పడమరగా సరస్వతీనదివరకుగల ప్రదేశమంతయు "మధ్యదేశము" అని పిలువబడుచుండినట్లు మనువు చెప్పుచున్నాడు. (మను. 2-21.) బ్రహ్మఋషిదేశము నిండిన పిమ్మట రెండవ వలసలో వెడలిన ఆర్యసంతానము ఈమధ్యదేశమున నివసించిరి.

ఆర్యా వర్తము (తృతీయవలస)

అటుపిమ్మట ఆర్యజాతీయులు మహర్షుల యనుజ్ఞవలన వారి రాజుల నాయకత్వమున మూడవ వలసగా బయలుదేరి వింధ్యహిమాచలములకు మధ్యనుండు ఖాళీప్రదేశ మందంతటను వ్యాపించి స్థిరనివాసము లేర్పరచుకొనిరి. ఆనాటికి భూగోళమంతయు నిర్మానుష్యముగా నుండి యున్నది. భారతవర్షములోగూడ నిప్పుడు మనవిచారణ యందుండిన ఆర్యజాతీయులు తప్ప యితరమానవు లెవ్వరును లేరు.

నాలవ, ఐదవ, వలసలు

అటుపిమ్మట విదేహమాధవు డనెడి రాజు తన గురుదేవుడైన గౌతమరహూగణుని ప్రేరణమున నానాటికి వృద్ధినిగాంచుచుండిన