పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

అష్టాంగయోగసారము

లందు తైలంబును నెట్లుండు నట్లు చరాచరప్రపంచంబునందు పరమాత్మ పరిపూర్ణంబై యిదమిత్థ మనరాకుండు టది యోగనిద్ర యగు. ఇది యింతంతసాధకున కనుభవంబుగా దది యనుభవించిన యోగికి అనుభవైకవేద్యం బగు. గాని వాక్కునఁ జెప్పఁగూడ దది యెట్లనిన,

శా. బ్రహ్మం బద్వయవస్తువౌ ననెడి శాస్త్రం బెప్పుడున్ బల్కుచున్
    బ్రహ్మాహ మ్మనునంతమాత్రముననే బ్రహ్మంబుగా నేర్చునే
    బ్రహ్మంబైన గురుస్వరూపము మదిన్ భావించి భావించి తా
    బ్రహ్మంబై నటువంటి కాలముననే బ్రహ్మంబనం గూడునే.

వ. ఇ ట్లవాక్ష్మానసగోచరం బైన బ్రహ్మానుభవంబె రాజయోగం బగు. ముందు జెప్పిన మంత్ర లయాదియోగంబుల యనుభవక్రమంబు లెట్లనిన,

మంత్రాదియోగానుభవక్రమము

సీ. మంత్రయోగంబుచే మారుతసంచార
        దేహమర్మంబులఁ దెలియవచ్చు
    లయముచేఁ దనలోని లలితప్రణవనాద
        సూత్రంబు మది నూని చొక్కవచ్చు
    హఠముచే జరను రోగాళిని మృత్యువున్
        కేడించి ధీరుఁడై గెలువవచ్చు
    సాంఖ్యయోగంబుచే సకలేంద్రియవ్యాప్తు
        లరయుచుఁ దన్ను దా నెఱుఁగవచ్చు
గీ. తారకముచేతఁ దనువులోఁ దాను వెలుఁగు
    చున్నరీతిని గనవచ్చు నుచితమైన
    రాజయోగంబుచేఁ బరబ్రహ్మమందుఁ
    బొంది యుండగ వచ్చు సంపూర్ణుఁ డగుచు.