పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదక హృదయం సంపుటి: 7 సంచిక : 1 అమ్మనుడి మార్చి 2021

తెలుగుభాష ఆశయ ప్రకటన - 5 సూత్రాలు

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆవిర్భవించి 2021 ఫిబ్రవరి 21 నాటికి 18 ఏళ్లు పూర్తయింది. తెలుగును కాపాడుకోవాలన్న ఆందోళన అప్పటికే తెలుగు వారిలో ఉంది. దానికి ఒక తీరుతెన్నూ కలిగించాలనే ఆలోచనతో కొందరు పెద్దలు తమకు తోచిన రీతిలో పని మొదలుపెట్టారు. ఈ అనుభవాల కొనసాగింపుగా కొందరు పెద్దలు పూనుకొని కృష్ణాజిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబరు 1,2 తేదీలలో నిర్వహించిన తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరం, తెలుగు భాషోద్యమ సమాఖ్యను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది. 2000 సం. లో యునెస్కో వారు ప్రపంచంలోని భాషా జాతులవారందరికీ ఇచ్చిన పిలుపుననుసరించి ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకోవలసి ఉంది. ఆరోజునే సమాఖ్యను ప్రారంభించాలని పెద్దలు నిర్ణయించారు. 2003 ఫిబ్రవరి 21న హైదరాబాదులో 'తెలుగు భాషోద్యమ సమాఖ్య' ఆవిర్భవించింది. శ్రీకాకుళం శిబిరంలో చర్చించి కొన్ని తీర్మానాలను విడుదల చేసింది. వాటి ప్రాతిపదికగా సమాఖ్య అప్పటి నుండీ పనిచేస్తూ, కాలక్రమంలో ఎదురైన అంశాలను కూడా చేపడుతూ ముందుకు సాగుతున్నది.

ఉద్యమాల దారిలో అవగాహన నుండి ఆచరణ వరకూ ఎన్నో సవాళ్లు ఎదురవుతూంటాయి. అందునా, తెలుగు ప్రజలు తమ సుదీర్ఘమైన చరిత్రలో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లూ అడుగడుగునా ప్రభావం కలిగిస్తూనే ఉంటాయి. సామాజిక, రాజకీయ సమస్యల ప్రభావం ఎక్కువ. రాజుల కాలంనాడు, వలసపాలకుల పరిపాలన కాలంలోనూ ప్రజలకు భాషతో ఉన్న అవసరాలు ఎన్నో పరిమితుల మధ్య ఉండిపోయాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత - విద్య యొక్క అవసరం ఎన్నోరీతుల్లో విస్తరిస్తుండడం వల్ల భాష యొక్క అవసరం కూడా ఎంతో విస్తరించింది. ప్రజలు తమ భాషలో తమను తాము పరిపాలించుకోవడం, తమ భాషలోనే అనంత విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకోవడం, అన్ని జీవనరంగాల్లో అందరూ వికసించడం - ఇవీ ప్రజాస్వామ్యానికి కొలమానాలు. స్వాతంత్య్రానికి సారాంశమూ ఇదే! ఇందుకోసమే బహుభాషలు గల భారతదేశంలో భాషారాష్ట్రాలు ఏర్పడ్డాయి. భౌగోళిక, రాజకీయ, పాలనా కారణాలవల్ల ఒకే భాషీయులైనా పలు రాష్ట్రాలు ఉండవచ్చుననేది ప్రజాస్వామికతలో భాగంగా గుర్తించవలసిన అంశం. అన్ని అంశాలు అవగాహనతో తెలుగుభాషోద్యమ సమాఖ్య ముందుకు సాగుతున్నది.

అయితే రెండు తెలుగు భాషా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా సొంత పాలకులే ప్రజలను మోసం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. భాషారాష్ట్రాల మౌలికతనే దెబ్బతీస్తూ పాలన సాగించారు, సాగిస్తున్నారు. ఇందువల్లే, సమైక్యంగా ఉండాలనే బలమైన కోరిక 60ఏళ్లకే విచ్ఛిన్నమైంది. అయినా రెండు రాష్ట్రాల్లోనూ భాషకు సంబంధించిన మౌలిక అవసరాలను విస్మరించడం కొనసాగుతూనే ఉంది. భాషను కొల్పోతే జాతి నశిస్తుంది. ఆ భావనను కోల్పోయిన ప్రజలలో సమైక్య చైత్యన్యం అణగారుతుంది. ఇదే ఇప్పుడు మనకు అన్ని రంగాల్లోనూ అనుభవంలోకి వస్తున్నది.

తెలుగు భాషోద్యమ సమాఖ్యను మొదలు పెట్టిన నాటికీ నేటికీ సమస్యల విస్తృతి పెరిగింది. సమాఖ్య ఎన్నో పోరాటాలు చేసినా పాలకుల్లో మార్పులేదు. ప్రజల్లో మాత్రం సమస్యల అవగాహన పెరిగింది. కాని, చైతన్యంతో ముందుకు సాగి సమస్యల పరిష్కారానికి పూనుకోవలసి ఉంది. ఇందుకోసం చైతన్యవంతులైన వారు చొరవ తీసుకోవాలి. ఇప్పటికే ఆందోళనతో ముందుకు వచ్చి పనిచేస్తున్న వ్యక్తులతోపాటు కొన్ని సంఘాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ వీరిలో కలిసి కట్టుతనం లేదు. ఈ విషయంలో సమాఖ్య కూడా వీరిని కలుపుకురాలేకపోయింది. ఇందుకు అనేక కారణాలున్నాయి. సమస్యల మౌలిక

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి • మార్చి - 2021

5