పుట:Varavikrayamu -1921.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

వరవిక్రయము


నీఁకేమి తోఁచుచున్నదే?

కమ:- (చివాలున లేచి) చెప్పుమనెదవా?

గీ. తండ్రులకుఁ గట్నబాధయుఁ - దల్లులకు వి
   యోగ బాధయుఁ దమకు నింకొకరి యింటి
   దాస్యబాధ దమకు దరిద్రంపు టాఁడు
   పుట్టువే పుట్టరాదని బుద్ధి నెంతు.

కాళిం:-(లేచి కౌఁగిలించుకొని) బళి బళి! బాగుగా జెప్పితివే!

ఉ. కట్టగృహంబు లమ్ముకొని కట్నమునీయక పెండ్లికాని యీ
    కట్టడి వక్రకాలమునఁ గానల మధ్యము నందు బుట్టగాఁ
    బుట్టఁగఁ జెల్లుఁగాని యొక భూపతి కేమియు నాడుబిడ్డగాఁ
    బుట్టగరాదు! పుట్టునెడఁ బుట్టినయప్పుడె గిట్టఁగాఁదగున్‌.

కమ:- అక్కా! ఒక్క సందేహము.

గీ. వెండినాణెంబె పెనిమిటి వేశ్య; కటులె
   కట్నములె భార్య లిప్పటి కర్కశులకు!
   వేశ్య వెలయా లనంబడె వెల గ్రహించి,
   కట్నములచేత వెలమగల్‌ కారె వీరు?

కాళిం:- కాకేమి, కాని మనమిపుడు కావింపదగిన దేమియు లేదా?

కమ:-లేకేమీ?

చ. తనువు లశాశ్వితంబులు గదా? క్షణభంగుర జీవితార్థమై
    ధన మిడి, భర్తలం బడసి దాస్య మొనర్చుటకంటె; బెండ్లియే
    యనువుగ మానిపించుకొని, హాయిగ రాట్నముత్రిప్పుకొంచు యో
    గినులగతి న్మెలంగిన సుఖింపమె? తీఱదె తండ్రి దీక్షయున్‌?

కాళిం:- సెబాసునే చెల్లీ! వయసునకుఁ జిన్నదానివైనను వరహాల కెత్తు కెత్తయిన మాట్లాడితివి! ఇదిగో.

గీ. నాదు ప్రతినంబు వినుము ప్రాణములనైన
   విడిచెదంగాని, యడిగిన విత్తమిచ్చి
   వరుని గొనితెచ్చినట్టి వివాహమునకు
   సమ్మతింప నా రాట్నము సాక్షిగాను.