పుట:Thittla gnanam.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తర్వాత జన్మ పురుషజన్మే కల్గడము మరియు ఆచారి కులములోనే పుట్టడము విశేషము. పోయిన జన్మలో బంగారు ఆభరణముల పనిచేయగ ఈ జన్మలో రాతి ప్రతిమలను చేయుపని కల్గినది. యుక్తవయస్సు తర్వాత శిల్పాచారియైన లెక్కాచారి యాబైసంవత్సరములకే చూపులోపము వలన పనిచేయలేక పోయెను. పనిచేయగల్గిన కొడుకులు సంపాదించలేదని తండ్రిని చులకనగ మాట్లాడజొచ్చిరి. ఐదు సంవత్సరముల తర్వాత మధుమేహ (సుగర్‌) వ్యాధితో ఆహారము కడుపునిండ తినకూడని పరిస్థితి ఏర్పడినది. తిన్న కొద్ది ఆహారము కూడ రుచిలేని తిండి. కాఫీలు తాగకూడదు. మత్తు పాణీయములకు అలవాటుపడ్డ దానివలన తాగకుండ ఉండలేడు. ఇలా యాబెైఐదు సంవత్సరములకే జీవితము దుర్భరముగ తోచినది. అరవై సంవత్సరములకు సుగర్‌ వ్యాధివలన ఒక కాలును తీసివేయడము జరిగినది. కుంటి బ్రతుకు మరీ దుర్భరమైనది. కొన్నాళ్ళకు కొడుకులు కోడల్లు ఇంటిలోనికి రానివ్వక ఇంటిబయటే ఉంచిరి. వాళ్ళు పెంచుకొను కుక్కనైన అప్పుడప్పుడు ఇంటిలోనికి రానిచ్చిన తనను మాత్రము రానివ్వకుండిరి. ఇలా కుక్కకంటే హీనముగ తనవారు చూడగ, శరీరము అశుభ్రతలో పందికంటే హీనముగ తయారైనది. 70 సంవత్సరముల వయస్సుకు శరీరము నరముల బలములేక మూత్ర విసర్జనకు పోకమునుపే గుడ్డలోనికి మూత్రమురావడము వలన ఆ వాసనకు సాటిమనుషులు తనవద్దకు పలకరించను కూడ రాకుండిరి. ఇటువంటి బ్రతుకు శత్రువుకు కూడ కలుగకూడదని తనకు మరణమొస్తే మంచిదని తలచుచుండెను. అందరు బ్రతికేదానికి దేవున్ని కోరుతుంటే తాను మాత్రము చచ్చేదానికి దేవున్ని కోరుచుండెను.