పుట:Thittla gnanam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందువలన "నీవు జ్ఞానము ఎడల సిగ్గుపడితే నీయెడల జ్ఞానము కూడ సిగ్గుపడునని" పెద్దలన్నారు. జ్ఞానము యొక్క లెక్కాచారము తెలియక జ్ఞానమువద్ద మోసము చేసిన లెక్కాచారికి జ్ఞానము కూడ మోసమే చేసింది. అదెలాగనగా! ఒక రోజు గురువుగారికి శిష్యులందరు నమస్కారము చేయుచుండిరి. ఆ సమయములో లెక్కాచారి తాను కూడ గురువు ముందర వంగి నమస్కారము చేసాడు. ఆ సమయములో గురువుగారి నోటినుండి ఒక మాట బయల్పపడినది. ఆమాట విన్న లెక్కాచారి తెలియక సంతోషపడినాడు. డబ్బు విషయములో తన పని తెలియక గురువుగారు సంతోషపడినాడులే అనుకొన్నట్లు, పలికిన పలుకు విషయము తెలియక సంతోషపడి పోయాడు. తాను తెలిసి మోసము చేసిన, తెలియకనే తాను మోసపోయినట్లు లెక్కాచారికి తెలియలేదు. ప్రపంచ విషయములలో అతి తెలివి ఉపయోగించు లెక్కాచారికి జ్ఞానములో కనిపించని ఫలితము తెలియకుండపోయినది. అంతకు గురువుగారి నోటినుండి వచ్చిన మాటేమిటి అంటే, అదియే "దీర్గాయుస్మాన్‌ భవ". దీర్గాయుస్మాన్‌ భవ అనుమాట నిజముగ చెడును సూచించు దూషనే అయినప్పటికి అతనికది దీవెనగానే కనిపించినది. నేను డబ్బిచ్చిన దానివలననే నన్ను దీవించాడనుకొన్నాడు. అక్కడ కూడ లాభమే వచ్చిందనుకొన్నాడు. జీవితములో జ్ఞానము తెలిసినప్పటికి అది తనకు ఉపయోగపడలేదు. ఎంత జ్ఞానము తెలిసిన అతడు జ్ఞానమునకెంత విలువిచ్చాడో, జ్ఞానము కూడ అతనికి అంతే విలువిచ్చినది. ఆ జన్మ అయిపోయిన తర్వాత మరుజన్మ లభించు సందికాలము సెకండ్ల కాలమే ఉండును. ఆ కొద్ది కాలములోనే జీవితమునకు సంబంధించిన ప్రారబ్ధము ఏర్పడును. అపుడు గురువుగారు పలికిన పలుకు యొక్క సారాంశము ప్రకారము సంచితకర్మనుండి ప్రారబ్ధమగును. గురువుగారి శాపము ప్రకారము ఆ క్రొత్త జన్మలో దీర్గాయుస్సు ఏర్పడినది.