పుట:Thittla gnanam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురువుగారు ఒక రోజు యోగసమయములో ఆత్మగ మారిపోయాడు. తన శరీరములోని ఆత్మగ మారడమేకాక సర్వశరీరములోని ఆత్మగ కూడ మారిపోయాడు. అపుడు లెక్కాచారి శరీరములోని ఆత్మకూడ ఆయనే కావున లెక్కాచారి శరీరములో జరిగిన గుణముల పనులన్ని తెలిసాయి. లెక్కాచారి శరీరములో ఆత్మ అన్నిటిని చూస్తు సాక్షిగ ఉన్నది కావున అన్ని విషయములు గురువుగారికి తెలిసిపోయాయి. తన డబ్బు ఇచ్చి తన స్నేహితునిదని చెప్పడము, ఆరునెలలకొకమారు చక్రవడ్డీ లాగడము తెలిసిన గురువుగారు జ్ఞానము యొక్క విలువ లెక్కాచారికి, మిగత భక్తులకు తెలియాలనుకొన్నాడు. తర్వాత కొంతకాలమునకు గురువుగారి జ్ఞానము తెలియుట వలన శిష్యులు గురువుకు ఎంతో ఋణపడి ఉంటారని, ఆ ఋణము అన్నిటికంటే పెద్దబాకీ అని, గురు ఋణము తీర్చుటకు ఎన్ని జన్మలైన చాలవని చెప్పాడు. ఆ మాటవిన్న లెక్కాచారి గురువుగారికి మేము బాకి ఉన్నట్లు నోటు వ్రాసివ్వలేదు కదా! ఆయన చెప్పు జ్ఞానమునకు మేమెలా బాకీ పడుతాము. పైసా ఖర్చులేకుండ నోటితో చెప్పు మాటలకు మేము బాకీ పడడము లెక్కాచారములేని మాట అనుకొన్నాడు లెక్కాచారి. లెక్కాచారికి అన్ని కనిపించు లెక్కాచారములే తెలియును, కనిపించని లెక్కాచారములు తెలియవు. అతని మనోభావమును గ్రహించిన గురువుగారు అతని అజ్ఞానానికి నవ్వుకొన్నాడు.


గురువు అనుకొంటే ఇటైన పంపగలడు అటైన పంపగలడు. గురువు అనుకొంటే మోక్షమునకైన పంపగలడు లేక జన్మలకైన పంపగలడు. గురువుగారు చెప్పెడిది అందరికి వర్తించు జ్ఞానబోధయే. నూటిమందికి జ్ఞానమును బోధించినప్పటికి అది కొందరికి మోక్షదారి, కొందరికి జన్మల దారి చూపగలదు. వినెడి మనిషి భావాన్నిబట్టి జ్ఞాన ప్రభావముండును.