పుట:TellakagitaM.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిని చూశాక..

కవిని చూద్దామని అతని ఊరు వెళ్ళాను
నా ఆలోచనల పునాదుల్ని కుదిపేసినవాడు
ఆవేశపు అలజడిని కన్నీటితో కరిగించినవాడు

ప్రశాంతమైన నిద్రలేని రాత్రుల్ని వరంగా అందించినవాడు
అలంకారాలు లేని అక్షరాలకు వ్యాపకశక్తి ప్రసాదించినవాడు
అతడెలా ఉన్నా.. ఆ కళ్ళల్లో వెలుగును చూద్దామని వెళ్ళాను

ఆనందం అనుభూతి ప్రధానమని
సూదిమొనకు సున్నితత్వం అద్దేవాడ్ని
ప్రేమను పదాలతో పంచేవాడ్ని
దయను ఆర్ద్రం చేసేవాడ్ని
కానరాని వరాలను గుప్పిట అందించే
రూపం చూడ్డానికి ..ఇది ఈనాటి తలపా!!
కళ్ళను చూపుతో తడుముదామని.. చేతిని చేతితో కలుపుదామని
ఇతనూ మనలాంటివాడే కదా అనుకున్నప్పుడు
నామీద నాకు గౌరవం పెరిగింది
కవిని కనుగొనాలని దిగంతాలలోకి దూకగలనా
వెలుగుని వెతుక్కుంటూ చీకటి బాట పట్టగలనా
అగ్గిని జల్లే ఆకాశాన్ని చుట్టుకున్న వాడ్ని నేను
చల్లబరచే సమీరాన్ని చేరాలని కోరుకునేవాడ్ని
కలల భస్మపు రాశితో బాటలు పరిచేవాడ్ని
గమ్యం చేరలేని దారని తెలిసినా
భుజం తట్టే చేతికోసం అలుపెరుగక ప్రవహిస్తున్నవాడ్ని
కవి సముద్రమో కాదో.. జట్టు కట్టిన సంతోషంలో తేలి
సాటి నదిలా కలసి..పారి... జీవితంతో సంగమిద్దామని
అన్నిరుచుల మట్టినీ ముద్దాడుతూ కథ ముగిద్దామని.
(కవి బివివి ప్రసాద్ కి...)