పుట:TellakagitaM.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాగిపో

బాల భానుని లేత కిరణం దేహానికి వెచ్చదనాన్ని ఇచ్చి
మనసును తాకక పోతే అది వేకువ కాదు.
చీకటి పరచిన దుప్పటి మెలకువతో తొలగినంతనే
నిద్రాలోకపు విహారాలకి ముగింపు కాదు.
రోజంటే పగలూ రాత్రి కలయిక కాదు
బతుకంటే గుదిగుచ్చిన పనులూ చిట్టాపద్దులూ కారాదు.

ప్రభాతపు తొలి వీక్షణం లోంచే కలలు
వెలుగు రేకల్ని ముద్దాడాలి
రాత్రైనా, పగలైనా కలల్ని వెలిగించుకోవడం..
నింగికీ, నేలకు నడుమ మేఘంలా
గాలిలో తేలి నిప్పునీ.. నీరునీ కౌగిలించుకోవడం.
కాలంతో కరిగిపోయేవరకూ కదిలిపోవడం
జీవితమిలాగే సాగిపోవాలి.

ఏదైనా ఒక రోజు మెరుపు మెరుస్తుంది.
పిడుగులు కురుస్తాయి జీవితం తడుస్తుంది
వడగాలై దెబ్బకు విసిరేస్తుంది
ఓ అవకాశం అందలమెక్కిస్తుంది.
ఒక ఆశని లోకం జారవిడుస్తుంది.
నిన్ను ఈ ప్రపంచం ఏమారుస్తుంది

ఒక్క క్షణం ఆగామా!!
నిరాశల నిట్టూర్పుల లోగిలిలో
నీ బతుకు నడి సంద్రపు లోతుని కొలిపిస్తుంది

ఎదురీతకు సిద్ధపడితే
విస్తరించిన సాగరాన్ని చీల్చుకుంటూ
వడివడిగా సాగే ఓడను తలపిస్తుంది. (ఓ విజయం తరువాత ..)