పుట:TellakagitaM.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నువ్వే.. నాగురువంటే..

నువ్వే నాగురువంటే కోసి ఇమ్మన్నాడంట వేలు
ఈ కాలంలో ఎవడైనా వింటాడా!!
నా వేలు నీకిస్తాను.. చేయిపట్టు అంటాడా!!
వినడం ఎందుకు!!.. జీవితకాల వేదనకా!!
గురువంటే!.. చెప్పొచ్చు మంచిగా ఎన్నైనా..
మరి అడగొచ్చా ఎదురేదైనా.. అని అడిగారా ఎవరైనా!!
ఏకలవ్యుడి నుండి కాసబియాంకా వరకూ..
విని చెడిపోయిన వారే తడవ తడవకూ
శిష్యలక్షణం అనన్య సాధ్యత్వమే గానీ
అంగుష్ఠ సమర్పయామి కాదే..
కావల్సింది పొందటం కాక వీడనిది కోసి ఇవ్వడం ఎలా ఒప్పు!!
ఆర్తి, అద్యవసాయం ఉన్నవాడెవ్వడూ తనకొమ్మ తాను నరుక్కోడు
గట్టిపూనిక ఉన్నవానికి ధ్యాస,శ్వాస.. విద్య మీద కాక
గురువు మీదా!!
అసలు విషయం అదికాదు..
నేర్చేవాడికి ఉండాలి బాగుపడే అలవాటు
విద్య నేర్పేదెవరైనా అందుకో ఆదరంగా;
శత్ర్రు శిక్షకుడి పై నీకెలా గురి!!
అసూయాగ్రస్తుడి శిక్షణ అనసూయగ మారుస్తుందా!
ఉపదేశం పొందలేక వేలిస్తే.. పడిన కష్టం తిరిగి వస్తుందా!!
వంచలేక విరిచే ద్రోణులకు ఈనాడూ కొదవ కాదు
కళ్ళు తెరచి చడవడం రావాలి పుస్తకాల్ని కాదు మనుషుల్ని
బాధల్ని చూడగల్గడం ఎదురొడ్డడం కావాలి
దార్శనికతతో ఉత్తేజితం అవ్వడం తెలియాలి
నానావిధ చరాచరాల సంబంధాలను చూడగల్గాలి
హాని చేసుకోక తప్పనప్పుడు అతితక్కువ తప్పుల దారిలో నడవాలి
ప్రశ్న అడగడం రాని శిష్యుడు వేలేం ఖర్మ తలెవరిదైనా కోసేస్తాడు.. లోకమర్యాదకు తలవంచేవాడు ఇంతకన్నా ఏంచేస్తాడు!! త్యాగధనుల జాబితాలో పేరుకోసం పాకులాట తప్ప..
మట్టిలోన కలసిన మనస్సాక్షులు కథల్లోనే గొప్ప. (ఓ 5 సెప్టెంబరున)