పుట:Subhadhra Kalyanamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాయునందనునకు - వందనం బొసగి
కవలు మ్రొక్కినవారి - గౌగిట జేర్చి
ఆయతిధిచేతను - అనిపించుకొనియు
చనియె తీర్థములకు - శక్రనందనుడు
గరిమ పెద్దలు పుణ్య - కథలు జెప్పుచును
ధర ప్రదక్షిణము స - దా చరింపుచును
అక్కడక్కడ గల - యఖిల తీర్థములు
వేడుక నాడుచు - విజయుండు కనియె
అంగవంగకళింగ - బంగాళములను
పార్థుండు గడిచెను - బహుదేశములను
గంగ స్నానము జేసి - కడు నీమమునను
సంగతిగ నొకనాడు - జపతపంబులను
గావింప నొక నాగ - కన్య యేతెంచి
కనుమూయ గావించి - యనురక్తి మించి
ఘనగతి నాగలో - కమునకు జనెను
మౌనంబు మాని యా - మగువ కిట్లనెను
మానిని వినవె జి - హ్మగ లోకమునకు
నేనేల వచ్చితి - నీకు పేరేమి
పూని తెల్పు మని యా - పొలతిని నడుగ
నై రావంతుడు జా - హ్నవికి వల్లభుడు
కౌరవ్వు డనువాడు - కలడు తక్షకుడు