పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

బహువచనసందర్భములగు విభ క్త్యనుశాసన సమాసాది సమాసాదిత కల్పనానల్ప జల్పితంబై వెలయునందు ౪ వచనంబులు బహుప్రకార రచనా నిచయప్రాచుర్యమ్ములై సంచరించు నందు ౫ విన్నపంబులెన్న విన్ననై ఋజుమార్గమ్ముల ననుగమించి మించు నీపంచ విధమ్ములు మితివిరహితమ్ములై స్వేచ్ఛాకల్పనా గౌరవమ్ముల కొలందుల విలసిల్లు.

(లక్షణశిరోమణి)

మీఁది లక్షణగ్రంథకర్తలలో ననంతుఁడు పదునైదవ శతాబ్ది వాఁడు. ఆతఁడు చెప్పిన గద్యలక్షణమున కనుగుణముగానే కర్ణాటాంధ్ర భాషలలోనిప్రాచీనవచనైకరచనలున్నవి. లక్షణశిరోమణికారుఁడు పొత్తపి వెంకటరమణకవి పదునేడవశతాబ్దివాఁడు గాఁబోలును! ఆతఁడు వచన రచనలనైదువిధముల విభజించినాఁడు. అతఁడు పేర్కొన్న 'విన్నపములే' యనంతామాత్యుఁడు చెప్పినగద్యములగును. ఇట్టి రచనములొకటి రెండు నిమిషములకు మించనికాలమునఁ జదువఁదగినవై స్తుత్య దేవతా సంబోధక పదాంతములైయుండును. వీనినే తాళ్లపాకవారు వచనగీతములని తాళగంధిచూర్ణకములనికూడఁ బేర్కొనిరి. ఈ విషయ మిఁక ముందు వివరింతును. అనంతామాత్యుని నాఁటికిఁదెలుఁగున భారత భాగవతాది గ్రంథముల వచనైకరచనలు లేవు గాఁబోలును ! అట్టివాని నాతఁడు పేర్కొనలేదు. పదునాఱవ శతాబ్దినుండియే భారతభాగవతాదుల వచనైకరచనలు తెలుఁగున వెలసినట్లున్నవి. లక్షణశిరోమణికారుఁడట్టివానిని దాను విభజించిన పంచవిధ విభాగములలో నాలుగవభేదమగు 'వచనము'గా నిర్వచించినాఁడు. ఈతని నాఁటికిఁ జూర్ణిక 'పొడిపొడి పలుకుల ప్రసన్నరచనగాక' సంస్కృత పుటుత్కలికాప్రాయరచనగామాఱినది. ప్రబంధరాజవిజయ వేంకటేశ్వర విలాసాదులందింకను సర్వలఘువచనములు, అంత్యాను ప్రాసచతుర్దళచూర్ణికలు మొదలగు వచనచిత్రరచనా ప్రభేదములు చూడఁదగును. మఱియు సంధ్రమున నన్నయాదికవుల కృతులలోని యాశ్వాసాంత వచనరచనలను 'ఆశ్వాసాంత గద్యము'లని పేర్కొనుటకలదు. అని లక్షణశిరోమణికారుఁడు చెప్పిన 'బిరుద గద్యము'లగు ననుకొనవచ్చును. అట్టి