పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

శ్రీ వేంకటేశ్వర వచనములు

న్నుండవని, ఒక గజముమాట వినివచ్చి కాచిన భక్తసులభుండవని, ఆఁడుదాని మొఱాలకించిన దయాళుండ వని, ప్రహ్లాదుని ప్రతిజ్ఞ చెల్లించిన భక్తపరిపాలకుండ వని, పదియాఱువేల నూటయెనమండ్రు దేవుల కందఱ కన్ని రూపులై వినోదించిన నెఱజాణవని నీకు మ్రొక్కితి ; నిన్నుం గొల్చితి ;భవంబులం గెల్చితి; సంతోషంబున నృత్యం బాడెదను; శ్రీ వేంకటేశ్వరా !

51

రావణాంతకా ! నీవు దేవసంరక్షణార్థమై పాయసంబులోఁ బ్రవేశించి కౌసల్యాగర్భంబున జన్మించి తాటకాహరణంబును, సుబాహు రాక్షసవధయును, కౌశికయజ్ఞ సంరక్షణంబును, అహల్యాశాపమోక్షణంబును, ధనుర్ భంగంబును, సీతావివాహంబును జేసికొని పరశురాముఁడు మింటికిం గట్టిన త్రోవలు దెగ నేసి దశరథుండు పట్టంబుగట్ట సమకట్టినఁ గై కేయిచేతఁ బదునాలుగేం డ్లరణ్యావాసంబునకు మితి చేసి కొనిన కారణం బేమి ? అవులే; దశకంధరునికిఁ బదునాలుగేం డ్లాయు శ్శేషము నాఁటికిఁ గలిగెఁ గాఁబోలును; తావత్పర్యంతమును, శూర్పణఖా నాసికాచ్చేదనంబును, మారీచ కబంధ ఖరదూషణాది హననంబును, వాలి నిబర్హణంబును, సుగ్రీవాదివరణంబును, వానర నియోగంబును, సముద్ర బంధనంబును జేసి యంతట రాక్షససంహారంబు గావించి, లంక విభీషణున కిచ్చి సీతాసమేతుండవై యయోధ్యాపట్టంబుఁ గట్టి కొంటివట ! ఎంత కపటనాటకసూత్రధారివి ? శ్రీ వేంకటేశ్వరా !

52

కేశవా ! నీవు విరక్తులకు మోక్షసుఖంబవై యుందువు; ప్రాకృతులకు సంసారంబవై యుందువు ; నిన్ను ధ్యానంబు సేయువారలకు సాకారంబవై యుందువు ; ఇతరులకు మువ్వురిలో నొక్కండవై యుందువు ; మూఢులకు నవేద్యుండవై యుందువు ; దనుజులకు