పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర వచనములు

3

మూర్తివి; నేను ప్రకృతిసంబంధంబులైన యంగంబులు ధరియించినవాఁడ; నది యెట్లు గూడు ననవలదు. ఆ ప్రకృతికి నీవు చైతన్యమవు. ఈ చుట్టఱికము తొల్లి కలుగఁగానే దీని కీయనురాగము గలిగి యున్నది. కన్నెఱుఁగకున్నఁ గడు పెఱుంగు నండ్రు లోకులు. ఇంతియకాని నిన్ను నెఱుంగ నే మెంతటివారము. నా యాస విన్నవించితి నింతియు కాని నిన్ను నేఁ గక్కసించినవాఁడఁ గానుజుమీ. శ్రీ వేంకటేశ్వరా!

5

దామోదరా! సకలతీర్థంబులు మీ కోనేటనే యాడితి. సకల తిరుపతుల విగ్రహంబులు మీ మూర్తియందే సేవించితి. సకలదానంబులు మీకు నొకకాసు కానుకవెట్టినయందె ఫలియించె. విహిత యజ్జాదికర్మంబులు మీ కైంకర్యంబుననే తీర్చితి. జపంబులన్ని మీ తిరుమంత్రమందె జపించితి. వేదపాఠంబులు మీ సంకీర్తమందె యభ్యసించితి. తపములు వైష్ణవాచారముల లభించె, నింక నేమిటం గడమలేదు. నా హృదయకమలంబున నీ వున్నాఁడవు. నా మనంబు శోధింపం బనిలేదు. నాణెంబైన టంకంబునకు వట్టంబు గొనరాదు. భండారంబునం బడినలెక్కకుఁ బరులు చాడిచెప్పం జోటులేదు. ఆరీతి నే నీసుముద్ర ధరించినవాఁడ, నగుటంజేసి, యేదోషంబులు నన్నుఁ బైకొనకుండఁ జేసి, రక్షింపవే శ్రీ వేంకటేశ్వరా!

6

హృషీకేశా! యేను బెక్కు జన్మంబు లెత్తియలసి పూర్వజాతిస్మరత్వంబు గలిగి యీపుట్టువున నిన్నుం గొలువవలయునని తలంచిన యుద్యోగంబునఁగాదు; శృంగారంబునకు నొసలఁ దిరుమణి వెట్టితి. మఱియు నాయుబ్బరితనంబున నీ సంకీర్తనలు నేర్చుకొంటె, నీ రీతి ప్రయత్నంబు లేక ఘునాక్షర న్యాయంబున నాచేఁతలు నీ దాస్యంబునకెక్కె. నీవు చక్కని మూర్తివిగావున నీ విగ్రహంబు నా యింటిలోపల నిడికొని నా వేడుకలకు దేవరంగాఁ గొల్చితిని. నా మీఁద