పుట:Sri-Venkateshwara-Vacanamulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

శ్రీ వేంకటేశ్వర వచనములు

బులకు సాష్టాంగ నమస్కారంబు చేసెద. ఏమినిమిత్తంబు చేసెదవంటివా? నాలుగు యుగంబుల ధర్మంబులు, సకలజంతువుల పరిణామంబులు, కమలాసనాదిదేవతల బ్రదుకులు, నీ మూలంబునఁ గావున నీవు శుభంబున నుండుటే మేలు; శ్రీ వేంకటేశ్వరా!

3

అలమేలుమంగాపతీ! నిన్ను వెదకి వెదకి కనియెద మన నే మెంతవారము? నీ సుద్దులు పెద్దల నడిగి వైకుంఠవాసుండ వనఁగా నీ యూ రెఱింగితిమి. విష్ణువాసుదేవ నారాయణ నామంబులు విని నీ పేరెఱింగితిమి. శరణాగతరక్షకత్వము నీకుఁగలదనఁగా నీ గుణం బెఱిఁగితిమి. నీలమేఘశ్యామ లక్షణంబులు గలుగంగా నీవర్ణం బెఱింగితిమి. శ్రీవత్సకౌస్తుభాది చిహ్నంబులుచూచి నీగుఱు తెఱింగితిమి. శేషాచలనివాసంబుకతన నీ గోత్రం బెఱింగితిమి. పురుషోత్తమఖ్యాతిచేత నీ పౌరుషం బెఱింగితిమి. వేణునాదవినోదివని చెప్పంగా నీవంశంబెఱింగితిమి. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాద్యవతారంబులు విని నీ పుట్టు వెఱింగితిమి. నీకు మ్రొక్కెదము. అన్నింట నధికుండవని నిన్నుం గొలిచితిమి. ఇంక నీ మహిమలం గొనియాడెదము. పాడెదము. శ్రీ వేంకటేశ్వరా!

4

క్షీరాబ్ధిశయనా! కమలంబు సూర్యుని కెదురు సూచినయట్లు నా హృదయ పద్మంబు రవిమండలమధ్యవర్తి యైన నీ కెదురు చూచుచున్నది. కుముదంబులు చంద్రోదయం బపేక్షించినట్లు నా కన్నుం గలువలు భవద్దివ్య ముఖ చంద్ర దర్శనం బపేక్షించుచున్నవి. మయూరంబులు మేఘాగమనంబునకుం జెలంగినట్లు నా మనోమయూరంబు నీలమేఘవర్ణంబైన నీ తిరుమేను దలంచి యానందించుచున్నది. ముత్యపుఁజిప్పలు స్వాతిచినుకులకు నోరు దెఱచినట్లు నావదనశుక్తి మీ పాదతీర్థంబునకు వికసించుచున్నది. సర్పంబులు గానంబులు గోరి చొక్కి పడగలెత్తియాడినట్లు నా వీనులు నీ కథల నాలకించుచున్నవి. నీవు పరాత్పర