పుట:Sinhagiri-Vachanamulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

సింహగిరి వచనములు

యైన జగన్మోహనాంగి యను వారకాంత కుచభరంబులమీఁద హస్తంబులు వహించి, తను వేఱుఁగక, నవరత్నఖచితకంకణము (ధరించి), పసిడి కుందనపు[1]పావాలు పాదంబుల మెట్టికొని, క్రొన్నెల నామంబు కొసర కస్తూరిబొట్టు దీర్చికొని, యుదయకాలమందుచెక్కిళ్లవెంట చెమటకారంగా, కనకపీతాంబరంబైన పచ్చడపుచెరగు తిరుముఖారవిందమునకు మఱుగు చేసికొని, నఖములు చెక్కిళ్ళ సందడింపుచు, నాతుల బింబాధరముల రుచులు గొన్న యధరములు కెంపులై కనపడంగా, నొకరూపున నరకేసరియై, యొకరూపున నాదివరాహంబై , యొకరూపున కూర్మావతారుండై , యొకరూపంబున కృష్ణమాచార్యులుగానే జనియించి, చాతుర్లక్షగ్రంథ సంకీర్తనలు సేయుచున్న కృష్ణమాచార్యులు, చీనిచీనాంబరములు ధరియించిన యనేక చెలికత్తెలైన వారకాంత లిరుపార్శ్వంబుల కైదండ నీయఁగా, నా కాంతావైభవంబులకుఁ జొక్కుచు, నా మహాత్ముండు మదోన్మత్తుండై నవ్వుచు, నా సల్లాపంబులకు సంతోషచిత్తుండై తామసగుణంబుల వేంచేసిన సమయమున, పొతకమూరి భాగవతులు పొడగని, కృష్ణమాచార్యులంగూడి సంభాషణ చేయ దొడంగిరి 'ఓ మహాత్మా! కృష్ణమాచార్యుల తిరుమాళిగ యెచట నున్నది మాకుం జెప్పు' మనిరి. అప్పుడు కృష్ణమాచార్యులు విభ్రాంతుఁడై కడు నింద్య (మయ్యె) నని తనలో తలపోసి తలపోసి, చింతాక్రాంతుండై, యడియని యజ్ఞానగుణకథ లడుగుచున్నారు. ఈ మహామహులతో నెటువలె సంభాషణ చేయుదును? ఎటువలె బొంకుదును? ఎటువలె విన్నపము సేయుదును! నే నజ్ఞానచిత్తుండను. నాకేది యుపాయము? దేవా, వీరిస్వరూపములఁ జూచిన నాళ్వారులస్వరూపులై యున్నారు. నేనేమి సేయుదును? చెప్పవే దైవమా!' అని యప్పుడు కృష్ణమాచార్యులు దుఃఖజీవుండై, కన్నుల జలంబులు భూకాంతమీదఁ బడంగాను, దనహస్తంబులఁ దనచెక్కిళ్లు తటతటఁ దాటించుకొని, మూర్ఛాక్రాంతుండై, కొంతవడిం జింతిల్లి, తెలివిగాంచి యంతటను బొతకమూరి భాగవతులగూడి సంభాషణ సేయ దొడంగెను. ‘ఓ మహాత్ములారా, (మీరు) కృష్ణమార్యుల తిరుమాళిగ నడుగుచు

  1. కుండల?