పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

370

వారు చదువులముగించి చాలకాలమునకు ఇంటికి మరలివచ్చిరి. వారువేదాంతమును చదివియుండిరాయని తండ్రి విచారణ చేయబూనినాడు. వారౌనని చెప్పగా, "మంచిది! బ్రహ్మమన నెట్టిదో నాకుచెప్పుడు" అనెను.

పెద్దకుమారుడు వేదములనుండియు, శాస్త్రములనుండియు, ప్రమాణములనుఎన్నిటినోజూపుచు ఇటుల జవాబుచెప్పినాడు:- ఓజనకా! బ్రహ్మమును నోటిమాటలతో వర్ణించుటకు వీలుపడదు; అది మనస్సునకు గోచరముకాదు." ఇటులతెలిపియు బ్రహ్మము ఇట్టిదిఅట్టిది అని వర్ణింపబూని, నాకంతయుతెలియునని వక్కాణించినాడు. తాను చెప్పుదానిని బలపఱచుటకై శృతివాక్యములను ఏకరువుపెట్టసాగెను.

కొంతవడికి తండ్రి వానితో "సరే! నీకు బ్రహ్మమును నిజముగా తెలిసినట్లే! నీపనిమీద నీవుపొమ్ము" అని వానిని పంపివేసెను. పిమ్మట చిన్నకొమరునిగూర్చి ప్రశ్నను తిరిగి వేసెను. ఆకుర్రవాడు మౌనముదాల్చినాడు. వానినోట ఒక్క పలుకైనను వెలువడదయ్యె. మాటాడుటకై ప్రయత్నమునేని అతడు చేయలేదు.

తండ్రి యిటులపలికినాడు:- "మంచిది; బిడ్డా! నీవు చేసినదే సరి! అవ్యయునిగురించి ఏమియు చెప్పగలదిలేదు. దానినిగురించి చెప్పుటకు నోరుతెఱవగనే అనంతము సాంతముగను, సంగరహితుని సంగసహితునిగను, అప్రమేయుని ప్రమేయునిగను వర్ణింపబూనినట్లనెను. మహాప్రగల్భముతో