పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

28

91. బ్రహ్మము శుభాశుభములచే లిప్తుడుగాడు. అతడు లాంతరునందలి దీపమువంటివాడు: ఆలాంతరుదీపముతో నీవుభగవద్గీతను చదువుకొనవచ్చును. దానివెలుగుసాయముననే దుష్టబుద్ధినె నీవొకకపటపుపత్రమును సృష్టిచేయవచ్చును.

మఱియు బ్రహ్మము పామువంటివాడు. పామునకు కోఱలందువిషమున్న నేమి? ఆపామునకు దానివలన హానిలేదు. ఆవిషముదానినిచంపదు. దానికాటునుపడసెనేని యితరజంతువులకు మాత్రమే అదిప్రాణాంతకమగును. అదేతీరున జగత్తున మనకుగోచరించు దుఃఖము, పాపము, ఇట్టికీడేదైనను మననుమాత్రమే బాధించును. బ్రహ్మము వీనియన్నిటికిని అతీతముగానుండును.

జగమునందలి యీమేలు, కీడు, బ్రహ్మమునకు అట్టివిగ నుండజాలవు. మానవులు శుభాశుభములను కొనుభావములను బ్రహ్మమున కనువర్తింపజేసి వానియోగ్యతను గణనచేయదగదు.

92. పరమాత్మను సృష్టిస్థితిలయకర్మములులేని నిష్క్రియునిగా భావనచేసినప్పుడు బ్రహ్మము లేక పురుషుడు అని పేర్కొందును. వానినే సృష్టిస్థితిలయకర్మల జేయుచు కర్మతంత్రుడై యున్నటుల భావనచేయునప్పుడు శక్తి, మాయ, ప్రకృతి అని పేర్కొందును.

93. నాలో "అహం" అనునది ఉన్నంతవరకును, జీవజగత్తులవంటి తనప్రభావరూపజాలము ద్వారమున ప్రత్యక్షమగుచు సగుణబ్రహ్మముకూడ నాయెదుటనుండును సుడీ!