పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

215

31వ అధ్యాయము.

615. నిజమైన భక్తుడు తనను ఏమానవుడును చూడజాలని ఏకాంతముననున్నప్పుడు సయితము, భగవంతుడు నిరంతరము తనను చూచుచుండుననిగ్రహించి, పాపకార్యములను ఆచరించజాలడు. ఎవడు ఒంటరిగ నట్టడవిలో, తనకొక యౌవనవతియగుమోహనాంగి యితరనరునికంటబడునను భీతిలేని తావున, వలపుజూపినయెడల, భగవంతుడు తమనుచూచుచున్నాడను భయముతోడ లోబడకుండునో, మఱియు కామ వీక్షణములనైన ఆమెవైపుపోనీయడో, అట్టివాడు నిజమైన దైవభక్తుడు. పాడుపడినయింటిలో ఎవరును లేనిసమయమున బంగారుసంచి కనబడినను దానినితాకక ఎవడు నిగ్రహము చూపునో, ఆతడు నిజమగుభక్తుడు. నలుగురు ఏమనుకుందురో యను భీతిచేత కర్మకలాపముల నిర్వహించువాడు నిజమైన భక్తుడుకాడు. నిశ్శబ్దముగ ఏకాంతస్థలమున నిర్వహింపబడు మతమే మతము. ఆడంబరము డాంబికము సాగుచోట సర్వమును బూటకమే, శుద్ధమోసమే!