పుట:Shodashakumaara-charitramu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

షోడశకుమారచరిత్రము


నిట్టిపాతకిఁ జెలిఁ జేసినట్టి బ్రహ్మ
యిన్నివిధములఁ దెలియంగ నేలయిచ్చు
నిన్నియును నేల యతఁడు ప్రాణేశ్వరుఁడుగ
నోము నే నోమఁగాక తొల్బామునందు.

112


క.

ఈయింతి తలఁచినట్లుగ
నీయగ్నిం గాలనైతి నీభూజముతో
గాయజువహ్నుల నిచ్చలు
నేయనువునఁ గాలుదాన నింకిట విధియా.

113


వ.

అనుచుఁ గన్నీరు పెల్లిగొన నన్నీరజనయన బహుప్రకారంబులం బలవించుచుండె నంత నమ్మహామహీరుహంబు హుతాశనుని కశనంబు చేసినదాన సంతుష్టహృదయ యైన యయ్యింతితో శిబిరంబున కరిగియున్నంత.

114


క.

కమలాకరుమై దైవకృ
తమునం బ్రబలజ్వరంబు దనుకొందుటఁ గృ
త్రిమహంసావళి తనచి
త్తమునం జింతింపఁ దొడఁగెఁ డద్దయు భీతిన్.

115


గీ.

శిరమునందు హంసావళి కరము వెట్ట
జ్వర మతిత్వరగతి మాను జనుల కనుచు
విన్నవాఁ డిప్డు నన్ను నివ్విధముచేయఁ
బనిచి బొంకైన ననుమానపడు విభుండు.

116


క.

నా చెలి యశోకకలికయు
నాచేసిన చేతతేఱఁగు నరపతి యడుగన్
వే చెప్పెనేని నక్కట
యేచంద మొనర్చుదాన నేనిటమిఁదన్.

117