పుట:Shodashakumaara-charitramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

111


నేల వచ్చి తిచట కేల యీదశ నొంది
తేల నన్ను నొంచె దిందువదన.

149


వ.

అని విలాపించుచు మదనతాపంబునం గాలుకొనలేక సౌధోపరిభాగంబునం జరియించుచున్నంత.

150


క.

క్షితినాథ మాయతురగం
బతిరయమున మేడమీఁది కరుదెంచి సము
న్నతఖురమునఁ జమ్మిన న
ద్భుతముగ నావర్ధమానపురమునఁ బడితిన్.

151


క.

పడి మూర్ఛ నొంది యెంతయుఁ
దడవునకుం దెలివి నొంది తత్పుర మగుటే
ర్పడ నెఱిఁగి నాదుపాటులు
గడుప మ్మగుటకును వగవఁగా నవ్వేళన్.

152


క.

కనకపురి గనినవారికిఁ
దనపుత్త్రికఁ గనకరేఖఁ దగుధనములతో
మనుజేంద్రుఁ డొసంగెడు నని
జను లెఱుఁగఁగ నగరవీధిఁ జాటం గంటిన్.

153


క.

ఆచాటు విని కనకపురి
చూచినరూపంబు రాజసుతగా దనుచు
న్నాచిత్తము కలఁక యుడుగ
వేచని తొంటిగతిఁ బతికి వినిపించుటయున్.

154


క.

ఆనరపతిపుత్రికయునుఁ
దానును నొక్కెడన యుండి తగఁ బిలిపింపం
గా నరిగినననుఁ గనుఁగొని
యూనెలఁతుక తొంటిధూర్త యని పలుకుటయున్.

155