పుట:Sakalaneetisammatamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. దక్షిణానిలముఁ బ్రదక్షిణాగ్నియును నధ్వ
సంతతోత్సాహంబు సాధువాద
చారుమంగళపాఠకారవంబు సుహృష్ట
పుష్టజనంబును బొలుపు మిగుల
నతిమనోహరముగా నరసిచెప్పిన శుభ
కలితలక్షణములు గలిగియున్న
యట్టివేలంబు ప్రఖ్యాతమై పొలుపొందు
నతిశుభమై యుండు నధికశత్రు
ఆ. జయము గలుగు నట్టిచంద మొందఁగ
విపరీత మయ్యెనేని ............ గదిరి
యపజయంబు నొందునట్టి చందములెల్ల
నెఱిఁగి నృపతి నిశ్చయింపవలయు. 810

క. ఇప్పగిది శుభాశుభములు
తప్పక చెప్పెడినిమిత్తతత్త్వస్థితిఁ దా
నొప్పగు భూపాలకులకు
నెప్పుడుఁ బరికించునది సమీహితబుద్ధిన్. 811

ఆ. తగుసహాయసంపదయును బ్రజ్ఞానంబు
సత్త్వవృద్ధి దైవశక్తియుక్తి
సముచితోద్యమంబు సద్వ్యవసాయంబు
గలుగునేని కలుగుఁ గార్యసిద్ధి. 812

కామందకము



చ. ఘనతృణధాన్యమిత్రజలకాష్ఠజలంబులనెల్ల నెమ్మెయిన్
బొనరగఁ గూర్చికో కెడరు పొందగఁ జేసిన హాని పుట్టు వీ
డున కటు గాన భూపతి పటుస్థిరబుద్ధి తృణాదిరక్షణం
బనువునఁ జేయు టొప్పగు నిరంతరముం గడు నప్రమత్తుఁడై. 813

అజ్ఞాతము



మ. పరగన్ భూపతి యిట్లు దండు విడియింపన్ యోగ్యమౌ సేనకున్
వెరవారంగ శుభాశుభంబులు గడు న్వీక్షించు టొప్పారు ని
ట్లరికి న్మేలును గీడుఁ జూచి యరిసైన్యం బల్పమైనన్ శుభం
బరియం దొందకయున్న నుద్యమము సేయన్ మేలగున్ యాత్రకున్. 814

కామందకము



వ. మఱియును. 815

క. ఘనబలనిహితుల శూరులఁ
దనగృహమున దుర్గములను దగ నిడి యుదకం
బును సస్యములును గలపథ
మున రిపుకై యేఁగవలయు మోదముతోడన్. 816

క. తనుఁ దనదేశము దుర్గము
ననువుగ రక్షింప నోపునాప్తులఁ దగుచో
నునుపక దండెత్తుట మొల
మునుగలవస్త్రంబు మస్తమునఁ జుట్టు టగున్. 817