పుట:Ranganatha Ramayanamu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రావణిచేఁ జిక్కి రాక్షసేశ్వరుని - కావర మణఁచంగఁ గడఁగి నే వాని
వరమందిరముఁ జేరి వలయు వాక్యములఁ - బరువడి నేఁ దెల్ప వాడు న న్గనలి1070
వాల మగ్నిఁ దగిల్చి వడి నేగు మనినఁ - గాలిచి లంకను గడువడిఁ గదలి
యగణితం బైనట్టి యంబుధి దాఁటి - మగుడ నిన్ గాంచఁగ మదిఁ దలపోసి
వచ్చితి నే" నని వసుధాధిపతికి - నచ్చుగా నతివియోగాగ్నికీలలకు
మచ్చిది యన నొప్పు మాణిక్య మిచ్చె; - నిచ్చిన నారత్న మేర్పడఁ జూచి
యనురాగమున దాని నల్లనఁ బుచ్చు - కొని డెందమునఁ జేర్చుకొని మూర్ఛబోయి
యొకకొంతప్రొద్దున కొయ్యనఁ దెలిసి - ప్రకటధైర్యంబునఁ బ్రాణము ల్నిలిపి
నృపతి బాష్పాకులనేత్రుఁడై చూచి - కపినాథు ననిలజుఁ గరమర్థిఁ బలికె.
“భానుజ! నా ప్రాణపదమైనయట్టి - మానినీమణి శిరోమణిఁ జూచినపుడె
నామది గరఁగుచున్నది లక్కవోలె; - నీమణి మామామ కిచ్చె నింద్రుండు.
యాగసంతృప్తుఁడై యఖిలంబు నెఱుఁగ - నాగుణనిధి జనకావనీవిభుఁడు1080
నట్టి యీమణి సీత యౌదల వేడ్కఁ - గట్టి పెండ్లి యొనర్చెఁ గరమర్థి నాకు
నన్నులతలమిన్న యైనయాసీత - నెన్నఁడు నెడఁబాయ దీమణి నేఁడు
నాతిని నన్ను మన్ననఁ గూర్పవచ్చు - దూతిక యన సిరు ల్దులకింపవచ్చె.”
నని యని యందంద యక్కునఁజేర్చి - హనుమంతు మఱియును నటఁ జూచి పలికెఁ.
“బరమపుణ్యాత్మక! పవనజ! నీవు - మరలి యేతెంచుచో మగువ యే మనియెఁ?
జెప్పు మేర్పడ” నన్న శ్రీరాముఁ జూచి - చెప్పంగఁదొణఁగె నంచితసత్త్వధనుఁడు.
"ఎడపనివగలతో నేనొకభంగిఁ - గడపితిఁ బదినెల ల్కాకుత్స్థుఁ బాసి
చల మూఁది రెండుమాసములకుఁ బిదపఁ - బెలుకుర నన్నుఁ జంపెదనన్నవాఁడు
రావణుఁ డటుగాన రామభూపతికి - నేవిధంబునఁ బ్రాణ మిటమీఁద నిల్వ
దని విన్నపము సేయు మనఘ! నాతండ్రి - తను సత్యధనుఁ డని తగ నిచ్చె నన్ను.1090
విలసిల్లుకల్యాణవేదిపై నుండి - వలనొప్ప నగ్నిదేవత సాక్షి గాఁగఁ
గరమర్థి న న్నెల్లకాలంబు విడువ - కరసి రక్షించెద నని తెచ్చి నన్ను
నరయ కుపేక్షించి యనదగాఁ జేసి - పరికింపఁ డని విన్నపము సేయు మనియెఁ
దక్కఁగఁ జనుదెంచి తనధర్మపత్ని - నొక్కఁ డెత్తుకపోవ నూరక యునికి
మహిలోన వీరధర్మము కాదు గాన - విహిత మంతయు విన్నవించితిఁ గాని
వలనొప్ప నామనోవాక్కాయకర్మ - ములు పూని తనయందె పొంది వర్తించు
నెనయంగ నాయొడ లెం దుండెనేని - యని విన్నపము సేయు మనియె మీదేవి.
చిత్రకూటాద్రిఁ దగ నొక్కకాకి - చెనకుటయును మనశ్శిలచేత మీరు
లీలతో మకరిక ల్లిఖియించుటయును - శీలించి గుఱుతుగాఁ జెప్పి నన్నియును
నీతి దప్పిన లోకనియతులు దప్పు - నీతియే తొడ వగు నిఖిలనృపులకు,1100
నని విన్నపము సేయు మనియె నాదేవి - యినవంశుతోఁ జెప్పి యిప్పుడే దండు
అనువొంద వెడలింపు మని విన్నవించె" - నని లక్ష్మణునితోడ నర్కజుతోడ
జనకజపలుకులు సకలంబుఁ జెప్ప - ఘనశోకమును మానె ఘనుఁడు రాముండు
చెప్పినఁ గపివీరసింహంబు లెల్ల - నప్పుడు దమలోన హర్షించి రంతఁ,