పుట:Ranganatha Ramayanamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నడవిఁ ద్రోపించితే? నాలిచేఁ బనిచి - కడుఁగష్టుఁడవు నీకుఁ గలవె ధర్మములు?
తిట్టుపాటున కోడి తివిరి నాకొడుకు - పట్టంబు మాన్పింపఁ బనిచెఁ గా కధిప?
సొంపేఁది రాముని స్రుక్కక కైక - చంపు మన్నను బట్టి చంపవే నీవు?
పెద్దకాలము నాకు బిడ్డలులేక - పెద్దయు శోకించి పెక్కులు నోచి
కడపట నొక్కనిఁ గని యేను గొంత - యుడుకారి యున్నచో నుండనీ వైతి"
వని దూఱు కౌసల్య నధిపతి చూచి - తనపూర్వకథ యెల్లఁ దాఁ జెప్పఁదలఁచి
“నీవు చెప్పిన దెల్ల నిజము గాఁగలదు - భావింప నే నట్టిపాపకర్ముఁడను
ఒడల బ్రాణము లిఁక నుండవు నాకుఁ - గడుబెట్టిదము లాడి కాఱింపవలదు
కౌసల్య! నాతొంటి కర్మభోగంబు - లొనరించినవి, యవి యూరకే పోవు;
దైవంబులకు నైనఁ దమకర్మఫలము - భావించి కుడువక పాయరా దెందు1130
నది యెట్టి దనినను నది చెప్పఁ జోద్య - మది తెల్లముగ విను మని చెప్పఁదొడఁగె.

దశరథుఁడు కౌసల్యకు తన శాపవృత్తాంతముఁ దెల్పుట

నా డెల్ల నేలెడునాఁడు నాపిన్ననాఁ - డొక్కనాఁ డేను నడురేయిఁ బోయి
యరుదైనవేఁటల నాసక్తిఁ బొంది - శరచాపములు పూని సరయువుచెంత
రేసి చూడఁగరాని రేవుచక్కటికి - డాసినపొదలలో డాఁగి యే నుండ
వఱిముఱి మృగకోటు లయ్యేటినీరు - పఱతెంచి క్రోలుశబ్దములు నచ్చటికి
వీనులు వీక్షించి వెస శబ్దవేధు - లైనబాణము లేసి యందందఁ జంపి
తనియక కాపున్నతఱి యజ్ఞదత్తుఁ - డనునొక్కమునిపుత్త్రుఁ డమ్మహానదికి
తిరమైనవిధి తన్నుఁ దెచ్చిన వచ్చి - కరమర్థి నచ్చట కలశంబు ముంప
గుదియక యట మ్రోయ గుటగుటధ్వనులు - అది మత్తగజ మని యడరి వేయుటయు
తీవ్రశర మప్పు డదరంట దాఁక - హాతాత! హామాత! యనునార్తరవము1140
పొరిఁబొరి నామర్మములు గాడిపాఱ - వరమునిసుతుఁ డుర్వి వ్రాలి యిట్లనియె;
క్రమ మొప్ప నడవులఁ గందమూలములు - నమలుచుఁ దపసినై ననుఁ గన్నగురుల
గొలిచి యేరికిఁ గీడు గోరని నాకు - గలిగెనే నేఁ డిట్టి కష్టంపుఁజావు?
ఎట్టిపాపాత్ములు నీరాత్రులందు - నెట్టనఁ జంపరు నెఱసి జంతువులఁ
బగళుల రతికేళిఁ బాయక మెలఁగు - మృగములఁ జంపరు మెయి నోటులేక
యెవ్వఁడొకో? నన్ను నీనడురేయి - క్రొవ్వాఁడిశరమునఁ గూల్చినవాఁడు?
వాఁ డేమి గతిఁ బోవువాఁడొకో యింక? - వాఁ డేమి సేయును వఱలు నామృతికి?
నక్కటా! వృద్ధులై యంధులై తమకు - ది క్కెవ్వరును లేక దీనులై యున్న
తల్లిదండ్రులు నేఁడు తమ కైనవగల - వెల్లియు నెబ్భంగి వెడల నీదెదరొ?
కడుఁబ్రొద్దు వోయె నొక్కఁడుఁ బోయి తడపె - కొడు కని మది నెంత గుందునో తల్లి?