పుట:Ranganatha Ramayanamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“నాయస్త్ర మెందు నెన్నఁడు రిత్తవోదు - నీయంగ మొకటి దానికి నిచ్చిపొమ్మ”
యనవుడుఁ దననేత్ర మయ్యస్త్రమునకు - ఘనభక్తితో నిచ్చి కాకంబు చనియెఁ1090
జెలఁగి రాఘవుఁ డంత సీతచేనున్న - ఫలములు దేవతార్పణములు సేసి
యాయున్నఫలముల నడవడఁ దృప్తు - లైయుండి రిమ్ముల నంత నక్కడను
రామువర్తనము నారయ మూఁడునాళ్లు - నేమించి గుహుచెంత నిలిచి మర్నాఁడు
మలగనివగల సుమంతుండు చాల - నలయుచుఁ జని యయోధ్యాపురిఁ జొచ్చి
సహజవైభవములు సర్వంబు నుడిగి - రహి చెడియున్న యారాజమార్గమున
నరుగుచోఁ బురజను లారథధ్వనులు - పరికించి యిదె రామభద్రుండు వచ్చె
నని సుమంతునిఁ జేర నరుదెంచి రథము - కనుఁగొని రఘురాముఁ గానక వచ్చి
క్రూరకర్ముఁడు రాముఁ గొనిరాక డించి - యీరిత్తరథ మేల నిటఁ దెచ్చె ననుచు
గుంపులు గుంపులు గొని తన్నుదూఱ - సొంపేది రామునిసుద్ది చెప్పుచును
రాజగేహముఁ జేరి రథ మంత డిగ్గి - రాజున్న యంతఃపురంబున కేగి1100
ధూళి గప్పినమేనితో బాష్పపూర - లోలనేత్రములతో లోలోనఁ బొదలు
కడలేనివగలతోఁ గౌసల్యయింటఁ - బడి ప్రలాపించు భూపతిఁ గాంచి, మ్రొక్కి
“భూమీశ! మీపుణ్యపుత్త్రరత్నంబు - రాముఁడు సత్యపరాక్రమశాలి
సౌమిత్రియును దాను జడ లొప్పఁదాల్చి - తామసింపక గంగ దాఁటి కాల్నడల
ననఘుఁడై చిత్రకూటాద్రికిఁ బోయె” - ననవుడు దశరథుఁ డాత్మ శోకించి
“యనఘ! సుమంత! రమ్మని చేరఁబిల్చి - తనయునిచరిత మంతయుఁ దప్ప కడిగి
గౌరవమతి నీవు గల్గితి గాన - మారామభద్రుసేమము లెల్ల వింటిఁ
గన్నులకఱవు శోకంబును దీరుఁ - జెన్నార నతనిఁ జూచినఁ గాని యకట
తనువునఁ బ్రాణము ల్ధరియింపఁజాలఁ - గొనిపోయి రఘురాముఁ గూర్పవే యనిన.
“వినవయ్య! శ్రీరామువెంటనేఁ బోవఁ - గని ప్రజ శోకించుఁ గైక దూషించు,
నిది విచార్యంబు గా దిది బుద్ధి గాదు - మది నింత వగవకు మనుజేంద్ర! నీవు
ధైర్యంబు పరికింపు ధర్మంబుఁ బూను - మార్యులు గొనియాడ ననఘుండ వగుము
అఱలేక నడవుల నఖిలభోగములు - మఱచి నీసుతులు నెమ్మది నున్నవారు"
అని పల్కి లక్ష్మణుం డన్నవాక్యములు - వినుపించుటయును భూవిభుఁడు శోకించి,
సౌమిత్రిమాట నిజం బౌనె? యట్టి - కామాంధుఁడను గ్రూరకర్ముండ ఖలుఁడ,
నని సుమంతుని వేగ యటు వీడుకొలిపి - తనమది శోకించు ధరణీశుఁ జూచి
“హారామ! హారామ! హారామ! యనుచు - శ్రీరాముఁ బలుమాఱుఁ జింతింప నేల?
ఏల నటించెద? వేల యీశోక? - మేల తాల్చెద వంత యెఱుఁగనే నేను?
నీవు లోకములలో నిందకు వెఱచి - ఆవలఁ గైకేయి కన్నియుఁ గఱపి
రాముఁ బట్టము గట్టి రాజుఁ గావించి - భూము లేలించెదఁ బొగడొంద ననుచు1120