పుట:Ranganatha Ramayanamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఘనతరశోకసంకలితుఁడై కైకఁ - గనుఁగొని పలికె నుత్కటకోపుఁ డగుచు
“నీయత్నమునఁ గదా నృపునకు మాకు - నీయవస్థలు వచ్చె నేమనఁగలను?
పతిహితం బేమియుఁ బరికింప వెట్టి - సతి వైతి వకట! రాక్షసివి నీ వరయ!
నీతల్లి యట్లనే నీవు ప్రాణేశ - ఘాతి వయ్యది యెట్టిగతి యన్న వినుము
సకలభాషలు నీదుజనకుఁ డెఱుంగు - నొకనాఁడు మీతల్లియును దాను శయ్య
నొఱపుగా శయనించి యొకకీటవార్త - యెఱిఁగి యాతఁడు నవ్వ నెద సంశయించి.
“యిది యేల నవ్వితి” వెఱిఁగింపు మనిన - "నది చెప్పినను బ్రాణహాని యౌ నిపుడు"750
ననవుడు “నీప్రాణహాని కే వెఱవ - వినుపింపు" మనిన వివేకించునతని
నదియె తప్పని వెళ్ళ నడఁచె మీతల్లి - యదిగాన నాచండి కాత్మజవైన
నీ కేల కలుగు మానితపతిహితము - ఓకైక!" యనిన నాయువిద యెంతయును..
దల వాంచి కొండొకతడవు చింతించి - పలికె నాదశరథపతిఁ జూచి యపుడు
“మున్ను మీకులమున ముఖ్యుఁడై సగరుఁ - డున్నతకీర్తియై యుర్వి నేలుచును
నసమంజసుండను నగ్రనందనుని - గొసరక పురి వెళ్ళఁగొట్టఁగా లేదె?
రామచంద్రుని నీ వరణ్యభూములకుఁ - దామసింపక పంపఁ దప్పేమి దీన?"
నన విని దశరథుం డధికశోకాబ్ధి - మునిఁగి ప్రత్యుత్తరంబున కోపకున్న
నపుడు సిద్ధార్థకుం డనుమంత్రివరుఁడు - కపటాత్మురాలైన కైక కిట్లనియె.760
“అసమంజసుండు దర్పాతిరేకమున - నెసఁగఁ బట్టణములో నెల్లబాలురను
సరిపట్టి కట్టి యాసరయువులోన - బరువడి వైవంగఁ బౌరు లందఱును
సగరునితోఁ జెప్ప జనహితంబునకుఁ - దగవు చింతించి యాతనయుఁ బోనడఁచె.
నీరామునం దొక్క యెగ్గెనఁ గలదె?- చారువర్తనగుణసౌజన్యుఁ డితఁడు."
నావుడు “సత్యంబు నాతోడఁ బలికెఁ - గావునఁ దండ్రివాక్యము సేసె సుకృతి
యగుఁగాక! రఘురాముఁ" డనవుడు కైక తెగువకు దశరథాధిపుఁడు శోకించి
చాల సంతాపించి జడిగొన్న వగలఁ - దూలుచు నాసుమంత్రునిఁ జూచి పలికె.
"ధనముల మణుల గోధనముల బంధు - జనముల నవరోధజనముల హితుల
విజయచిహ్నంబుల విలసిల్లుచున్న - గజముల రథముల ఘనతురంగముల770
నిజముగా వేఁటకు నేర్చుధీవరులఁ - బ్రజల మంత్రుల రామభద్రునివెనుక
వెడలింపు మీరిత్తవీడు కైకేయి - కొడుకు బట్టము గట్టుకొని యేలుఁగాక!"
యని యిట్లు దశరథుం డాడువాక్యములు - విని కైక గోపించి విభుఁ దూఱి పలికె.
“రాజపుంగవ! నీవు రామచంద్రునకు - రాజిల్లు నీసర్వరాజ్యసంపదలు
నిచ్చి పాడై యున్న యీపురం బేల - యిచ్చెదు భరతున? కీపల్కు లేల?
సౌమిత్రియును దాను జనకనందనయు - రాముఁడు నారచీరలు గట్టి ప్రీతి