పుట:Ranganatha Ramayanamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నేను జూచుచునుండ నెల్లభోగములు - మాని దుర్గములఁ గ్రమ్మఱఁ బోవకున్న
బొసఁగదు నీయీవి బొంకు నీపలుకు - వసుధేశ! నీ విచ్చు వరము నే నొల్లఁ;
దప్పితి వీ" వన్న, దశరథాధీశుఁ - డప్పుడు మూర్ఛిల్లి యవనిపైఁ ద్రెళ్లె;
ధరణిపై నట్లున్న తండ్రినిఁ జూచి - పరితాప మందుచుఁ బలికె రాఘవుఁడు.
“ఏలమ్మ! కైకేయి! యిమ్మహారాజు - తూలఁ బోఁ బలుమాఱు దూఱనాడెదవు?780
గురుఁడును రాజు నాకూరిమితండ్రి - పరమదైవం బిట్టిపతి నన్నుఁ బనుప
విషమైన మ్రింగుదు విపులాగ్నినైన - విషధియైనను జొత్తు వేడ్కతో నేను;
వనమున మునులతో వర్తింపుమన్న - ననుమతించుట నాకు నది యెంత పెద్ద”
యన విని దశరథుఁ డావాక్యములకు - మనమునఁ గడుఁ దూలి మఱి కైకఁ జూచి
"విను మేను రాజ్యంబు విడిచి యీరాము - వెనుకఁ బోయెదను నీవిభవంబుతోడ
భరతు నయోధ్యకుఁ బట్టంబు గట్టి - ధరణి యేలుదుగాక! తగ వేల?" యనఁగ
నామాటలకు రాముఁ డధిపుతో ననియె - "భూమీశ! నిర్జనభూమియై పరఁగు
నవ్వనంబును నాకు నర్హమై యుండు - నెవ్వరు నాతోడ నేటి కేతేర?
నారచీరలు దెచ్చి నాకిండు వాని - నారంగ ధరియించి యడవులలోన
పదునాలుగేండ్లును బరఁగ నీయాజ్ఞ - వదలక వర్తించువాఁడను నేను790
దే నారచీరలు దేవి! నా" కనిన - నానాతి నిర్లజ్జయై తానె యపుడు
ముద మంది మదిలోన మొగమాటలేక - మది చలింపక సభామధ్యంబునందు
నారచీరలు దెచ్చి "నరనాథపుత్త్ర! - గారవంబున నీవు కట్టుకొ" మ్మనుచుఁ
బేరెలుంగునఁ బల్కఁ బ్రియముతో రాముఁ - డారాజసభయును నా రాజు నడల
నాతల్లిచే నున్న యవి పుచ్చుకొనుచు - భాతిగా మున్నున్నపటములు విడిచి
నారచీరలు గట్టె నయముతో నపుడు - నారంగ ధరియించె నాలక్ష్మణుండు;
సీతకు నానారచీరలు రెండు - చేత నిచ్చినఁ గొని చిత్తంబులోన
కలఁగి రామునిఁజూచి "కాంతారవాసు - లెలమిమై నీచీర లెట్టుఁ గట్టుదురొ?
మును” లంచు నొక్కటి మూపుపై వైచి - తనరార నొక్కటి తనకేలఁ దాల్చి
కట్టనేరక మది గలఁగ నారాముఁ - డట్టిచందముఁ గాంచి యాపువ్వుఁబోణి800
ఘననితంబమునఁ బొంకముమీఱఁ గట్టఁ - గని రాజసుతులు రాఘవుని వీక్షించి
"నారచీరలు గట్టి నరనాథపుత్త్ర ! - యీరాజవరపుత్త్రి నీసీత నెట్లు
దారుణగతి నిట్లు తాపసిఁ బోలి - ఘోరాటవికి నీవు కొనిపోవఁ దగునె ?

వసిష్ఠుఁడు కైకతోఁ గఠినోక్తు లాడుట

మామాట మన్నించి మాయొద్ద నునిచి - సౌమిత్రియును నీవుఁ జనుఁడు కానలకు”
ననఁగ వసిష్ఠుండు నలుకతోఁ గైకఁ - గనుఁగొని "కులనాశకారిణి వీవు
భూపాలకుని మోసపుచ్చితి కాన - నీపాప మరయంగ నెందును గలదె?