పుట:Ranganatha Ramayanamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాజేంద్రుఁ గనుఁగొని రామలక్ష్మణులు - పూజితచరితయౌ భూతనూభవయు
వచ్చినా రని చెప్పఁ బడి మూర్ఛవోయి - చెచ్చెఱఁ దెలివొంది చెందినవగల
నల్లన గద్దియ నాసీనుఁ డగుచు - నుల్లంబులో ధైర్య మొక్కింత నిలిపి
“వత్తును గాక నావనితలు నింక - వత్తురు గాక! నీవరపుత్రుఁ జూడ”
ననుచు డగ్గుత్తిక నల్లనఁ బలుక - విని యాసుమంతుండు వినయంబుతోడ
నంతఃపురంబుల కరిగి యారాజు - నింతుల మున్నూటయేబండ్రఁ దెచ్చె
మఱి పోయి యారామమహనీయతేజు - తెఱఁగొప్పఁ దోడ్కొని తేర నీక్షించి
యాలింగనము సేయ నర్థితో లేచి - యాలోన రాలేక నవనిపైఁ బడియె.720
నంత నాశ్రీరాముఁ డారాజుఁ బట్టి - యెంతయుఁ బ్రేమచే నెసఁగంగఁ దిగిచి
తొడలపై నిడికొని దుఃఖింపఁ గొంత - వడికి చైతన్యంబు వచ్చి కూర్చుండి
తనుఁ జూచుచున్న యాతండ్రి నీక్షించి - జననుతుం డగురామచంద్రుండు పలికె.
“ననఘాత్మ! నీదుసత్యము నిల్ప నేను - వనభూములకుఁ బోవువాఁడ నౌ టెఱిఁగి
యీసాధ్వి జనకమహీపాలతనయ - యీసుమిత్రాపుత్రు లిద్దఱు మిగుల
వల దని యే నెంత వారింప వినక - నలరి తామును బయనమై యున్నవారు.
గాన వీరలు నేను గానల కేగ - నానతి" మ్మనుటయు నానరేశ్వరుఁడు
మదిఁ దూలి "కైకేయిమాటకు నిన్ను - నదయతఁ బొమ్మంటి నకట! కానలకుఁ
జేకొని నామాట సేయంగ నేల - నీ కెట్లు నందన! నీవు నీయంతఁ
జెన్నొంద రాజ్యంబు సేయుదు గాక" - యన్న నామాటకు హస్తముల్ మొగిచి730
“తలపోయ గురుఁడవు ధారుణీపతివి - ఎలమిమై రక్షింప నిల బాంధవుఁడవు
నటుగాన నీవాక్య మర్థితోఁ జేయ - నిట నాకు నానతి యిచ్చి న న్ననుపు
సత్యసంధుఁడ వైన జనలోకనాథ! - నిత్యంబుగా నేలు నిఖిలలోకములు"
ననిన “దీర్ఘాయువు నత్యంతశుభము - వినుతయశంబును విమలవిక్రమము
నకళంకధర్మంబు నమరంగఁ బొందు - మొకబాధయును లేక యుండు మోపుత్ర!
యారంగ నన్నును నరయ మీతల్లి - నీరాత్రి చూచి నీవెల్లి పొ" మ్మనిన
"నేఁ డేమి యెల్లేమి నిలువంగఁ దగదు - నేఁడు పోయెచ మన్న నెమ్మి వీడ్కొలుపు
నరనాథ! నాయీగి నాతమ్ముఁడైన - భరతుండు వసుమతిఁ బాలింపనిమ్ ము.
వగపు నీ కిటమీకు వల" దన్నరాము - తెగువకు దశరథాధిపుఁడు శోకించి740
“నీవంటి సత్పుత్త్రు నిష్ఠురాటవులు - కీవెంటఁ బొమ్మన నెట్లు నోరాడు?
కైకేయిమాటల కడుమోసపోతి - గా కటకట!" యని కరుణఁ దా నేడ్వ
నంతఃపురాంగన లందఱు నడల - నంతఁ గౌసల్యయు నాసుమిత్రయును
వంతల వ్రాలుచు వగలఁ దూలుచును - వింతగా భువిఁ జేరి విలపించుచుండ
నపుడు సుమంత్రుఁ డయ్యతివలయేడ్పు - నృపుశోకమును జూచి నిట్టూర్పుఁ బుచ్చి