పుట:Ranganatha Ramayanamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనుదెంచి యారామచంద్రు నీక్షించి - తనరంగ దీవించి తా నిట్టు లనియె.
“పేదవాఁడను సుతుల్ పెక్కండ్రు గలరు - లేదు ద్రవ్యంబును లేశమాత్రమును
నను నీవు రక్షింప నరనాథ! వలయు" - ననిన నారఘురాముఁ డావిప్రుఁ జూచి
“యావులమంద లయ్యా! యున్న విపుడు నీవు నీచేముష్టి నిజశక్తి మెఱసి
యెందాఁక నేసితి వీలోని పశుల - మంద నీకె" యటన్న మది సంతసిల్లి
యఱచి ధోవతి మొలనంట బిగించి - కుఱుచైనశిఖముడి గొని యౌడుఁ గఱచి
నరములఁ బ్రాణముల్ నరి నంటఁబట్టి - కరమునఁ బాషాణకలితుఁ డై యపుడు
శ్రీరమాధవు నెంచి శ్రీరాము నెంచి - బిరబిరఁ దనముష్టిఁ బెట్టుగాఁ ద్రిప్పి690
యురమున జందెము నుఱ్ఱూతలూఁగ - సరయువు దాఁక విచ్చలవిడి నేసె.
బ్రతుకుజీవన మని బ్రాహ్మణుం డట్టి - మొదవుల గొన్న రాముఁడు చోద్యమంది
"మఱి వేయుగోవుల మహితవస్త్రముల - నఱలేక యిచ్చెద నడుగుమీ" యనిన
జన్నంబునకు నీవు చాలినయర్థ - మెన్న నెక్కుడుగాను నిమ్మండు నడుగఁ
దనియంగ నిచ్చినఁ దద్దయు నలరి - తనపత్నితోఁగూడ ధనములు గొనుచు
సంతోషమున నటఁ జనెఁ ద్రిజటుండు - నంతట రఘురాముఁ డనురాగ మెసఁగఁ
గృతకృత్యుఁడై వచ్చి గృహదేవతలకు - చతురుఁడై మునులకు సద్భక్తి మ్రొక్కి
యీరీతి రఘురాముఁ డెల్లవస్తువులు - కోరినవారికిఁ గోరిన ట్లొసఁగి
మును జనకునియజ్ఞమున వరుణుండు - తన కొసంగిన తనుత్రాణకోదండ
ఘనతరతూణీరఖడ్గాయుధములు - తనకులగురునింట దాఁచుటఁ జేసి700
యనుజుచేఁ దెప్పించి యవి ధరియించి - జనకజాలక్ష్మణసహితుఁడై వెడలి
రాజునొద్దకు వేగ రాజచిహ్నంబు - లోజఁ గానక పౌరు లుల్లంబు లలర
రాజవీథులనుండి రచ్చలనుండి - రాజీతోన్నతసౌధరాజిపై నుండి
పుట్టినశోకాగ్ని పొగలుచుఁ గొంద - ఱిట్టిదుర్దశ కర్హుఁడే రాముఁ డనుచు
నెందు రాముఁడు వోయె నింక నందఱము - నందె పోదముగాక! యని కొంద ఱరుగ
కొందఱు రాజన్యకుంజరు వెనుక - మందిరంబులు డించి మన మెల్లఁ జనఁగ
నేపార సొంపెల్ల నెడలి పాడైన - యీపట్టణము కైక నేలని మ్మనుచుఁ
బరికించి కొందఱు ప్రజ లీపురంబు - పొరిపొరి నెలుఁగులు పులులు సింగములు
వక్కలు వరళులు నలిపిశాచములు - పెక్కుభూతంబులు ప్రేతసంఘములు
పాయని యడవిలోఁ బతి రాముఁ డున్న - యాయరణ్యము పురం బగు నంచుఁ బలుక
క్రందయ్యె బహువిధాక్రందనరవము - నందంద వినుపింప నధికధైర్యమున710

శ్రీరాములు సీతాలక్ష్మణసమేతుఁడై దశరథునివద్దకు వచ్చుట

జగతీశునగరికిఁ జనుదెంచి మఱియుఁ - దగ సుమంతునిఁ గాంచి ధరణీశసుతుఁడు
వినిపింపు మారాక విభునితో ననినఁ - జని శోకమునఁ జాల సంతాపమందు