పుట:Ranganatha Ramayanamu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొనివచ్చి గద్దియ కొమరార నునిచి - వినుతార్ఘ్యపాద్యముల్ వేడ్కతో నిచ్చి
హారకుండలవలయాంగదకటక - చారుకోటీరాదిసకలభూషణము
మాతులుం డొసఁగిన మదగజేంద్రంబు - ఖ్యాతి శత్రుంజయాఖ్యము మొదలైన
కరిసహస్రంబును కమనీయరత్న - సురుచిరదివ్యవస్తువు లెల్ల నొసఁగి
బహుభూషణము లిచ్చి పయిపయితోన - మహనీయరత్నముల్ మానుగా నిచ్చి
పసిఁడి యేర్పడఁ బుచ్చి పదికోటు లొసఁగి - యసమానవస్తువు లన్నియు నొసఁగి
యిచ్చినఁ గైకొని హృదయంబులోన - నచ్చెరు వడరంగ నధికమోదమున
నారాజమిథునంబు నతఁడు దీవించె - నారంగ రఘురాముఁ డప్పుడు మఱియు
నెడపక భండార మెల్లఁ దెప్పించి - తొడరి దీనులకు నర్దులకుఁ బేదలకు
చెలిమి నగస్త్యకౌశికు లనువారి - కిల రత్నరాసు లనేకంబు లొసఁగి660
మొగి వసిష్ఠాదిసన్మునిజనంబులకుఁ - దగు తపస్వులకు నర్థము లొప్ప నిచ్చి
వందిమాగధులకు వరదానశక్తు - లెందును బొగడంగ నిలు చూర నిచ్చి
పేదసాదలకును పృథ్విదేవతల - కాదట బంధుమిత్రాశ్రితావళికిఁ
బన్నుగా నిబ్భంగి బహుదానతతులు - సన్నుతమతి నిచ్చి సౌమిత్రిఁ జూచి
“నీవును దానంబు నెమ్మిఁ గావింపు" - నావుడు నారాజనందనుం డలరి
ఘటజన్మగౌశికుఁ గార్గు శాండిల్యు - నటకు రప్పించి పెక్కర్థంబు లిచ్చి
వీరువా రన కెల్లవిధములవారు - నారంగ నెవ్వ రే మడిగిన నిచ్చె;
ధరణీశుఁ డాతనిఁ దనబుద్ధి యలరఁ - గర మొప్ప నతిమహాకల్యాణియైన
యీయరుంధతికి సుయజ్ఞునిసతికి - నాయతం బగుభక్తి నప్పుడు సీత
తనభూషణము లిచ్చి తనయర్థ మిచ్చి - తనయింటఁ గల వస్తుతతు లెల్ల నిచ్చె.670
నప్పు డరుంధతి “యకట యిక్ష్వాకు - లిప్పాటు పడుచుంట నిటుఁ జూడఁదగునె?"

శ్రీరాములు త్రిజటాఖ్యునకు గోవుల నిచ్చుట

యని వసిష్ఠు నడుగ నమ్మహామౌని - తనబుద్ధి నెంతయుఁ దలపోసి చూచి
"యేరూపమునఁ బోవ దిది దైవయోగ - మూరకుండుము చూచుచుండుద" మనియె
ఆవేళఁ ద్రిజటాఖ్యుఁ డనువిప్రుఁ డడరి - జీవనస్థితికినై చేను దున్నుచును
ఘోరంపులేమిచేఁ గుందుటఁ జేసి - పేరాసఁ దత్సతి బిడ్డలఁ గొంచు
నతిసంభ్రమంబున నచ్చోటి కరిగి - తతిగొనఁ బనిసేయు తద్భర్తఁ జూచి
“యేల యీనాగేలు హృదయంబుచివుర - నేల యీగుద్దలి యిటఁ బాఱవైచి
రమ్ము చెప్పెద నేఁడు రామచంద్రుండు - సమ్మదంబున నర్థిజనులకు నెల్ల
ద్రవ్యతండంబులు దయతోడ ధనము - నెవ్వ రే మడిగిన నిచ్చుచున్నాఁడు.
నీకుటుంబము చెప్పి నీపేరు చెప్పి - కాకుత్స్థపతిచేతఁ గామితార్థంబు680
వేవేగ చని నీవు వేఁడుకొ" మ్మనిన - నావిప్రుకోర్కెలు నందంద నిగుడఁ