పుట:Ranganatha Ramayanamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధరణీశుఁడును సుమిత్రాపుత్రుఁ జూచి - చేర రమ్మని రామచంద్రుఁ డిట్లనియె
“నాతోడ నీవు కానకు వచ్చెదేని - నాతోడ నినుఁ బాసి నానావిధముల620
మిడుకు కౌసల్య సుమిత్ర లెవ్వార - లుడు కార్చి పోషింతు రెవ్వరు భక్తి
మనమిద్దఱముఁ జన్న మనతండ్రి భక్తి - ననుదినంబును నెవ్వ రరయువా రిచట
మొదలన సవతిపై మ్రొగ్గుఁ గైకేయి - మదిలోన నీరాజ్యమద మింక నొదవుఁ
బేర్మి చూపుచు దుఃఖపెట్టునో కైక - ధర్తంబు తలపోసి తగ వేల నడుపు
నటుఁగాన నే వచ్చునందాఁక నీవు - నిట నుండఁదగు” నన్న నెంతయుఁ గనలి
యావేళ లక్ష్మణుఁ డన్ననిశ్చయము - భావించి తనపాణిపద్మముల్ మొగిచి
“యప్పుడు నన్ను రా నానతి యిచ్చి - యిప్పుడు వల దను టేమి కారణము?
కౌసల్య కృపరక్ష గాక నారక్ష - యాసుమిత్రకు నేటి కాతేజ మరయఁ
బదివేవురకు నున్కిపట్టు నీవెలుఁగు- నిది యేల చింతింప నిట రామచంద్ర
భరతుండు నీదెస భయమునఁ జేసి - తిరముగాఁ గౌసల్యదేవికి భక్తి630
కరము సుమిత్రకుఁ గావించునటుల - నిరవొంద నటుఁగాన నే నిందు నిలువ
బాణబాణాసనపాణినై వెనుక - దూణీరములుఁ బూని దుర్గమాటవులఁ
బొందుఁగా మిమ్ము నిమ్ములఁ గొల్వవలయు - గందమూలాదులు కడకఁ దేవలయు
నటఁ దృణపర్ణాదు లరసి మీ రుండు - కుటజము పజ్జగాఁ గూర్పంగవలయుఁ
బదునాలుగేండ్లును బగలును రేయి - నిదుర వోవక సేవ నెఱి సేయవలయు
వచ్చెద నే" నన్న వసుధేశుఁ డతని - నిచ్చమైఁ గైకొని యింపుదళ్కొత్త
"వలయుబంధుల నెల్ల వరుస వీడ్కొనుము - వలనొప్పగా మున్ను వరుణదేవుండు
మనతండ్రి కిచ్చిన మహితచాపమును - ఘనశరశ్రేణులు గలకవదొనలు
కర మభేద్యం బగు కవచంబు పసిఁడి - పరుజులఁ జెన్నొందు పటుకృపాణములు
కొని రమ్ము" నా నేగి కొమరార బంధు - జనుల వీడ్కొని శస్త్రశాలకు నరిగి640
యాయుధంబులు గొంచు నరుగుదెంచుటయు - నాయతాత్ముఁడు రాముఁ డనుజన్ముఁ జూచి
“తమ్ముఁడ! వినుమెల్ల ధనములు నేను - నెమ్మి నిచ్చెద ధరణీసురవరుల
మహితపురస్థుల మనకింపులైన - సహజభృత్యుల నర్థి జనుల రావింపు
మావేళ నర్హుండు నఖిలజ్ఞుఁ డైన - యావసిష్ఠునిపుత్రుఁ డయిన సుయజ్ఞు
మొదలైనపుత్రుల ముదము చిత్తమునఁ - బొదలంగ నతిభక్తిఁ బూజింపవలయు
మఱియుఁ దక్కినవారి మన్నింత మెల్ల - తెఱఁగుల నక్కఱ తీర నర్థులకు"
ననవుడు లక్ష్మణుం డౌఁగాక యనుచు - మునిపుత్రునింటికి ముదముతో నరిగి
రామువాక్యముఁ జెప్పి రమ్మన్న నతఁడు - నేమంబు లన్నియు నిష్ఠతోఁ దీర్చి
సౌమిత్రిసహితుఁడై చనుదేరఁ గాంచి - రాముఁడు వినయాభిరాముఁడై తాను
నెలమిమై సీతతో నెదురుగా వచ్చి - యలఘుతేజోమూర్తి యైనమునీంద్రుఁ650