పుట:Ranganatha Ramayanamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నయ్యెడ నారాముఁ డవనీశచంద్రు - నొయ్యనఁ బట్టి శైత్యోపచారములఁ
దెలిపి యంతయును బోధించుచు మఱియు - బలికె కైకను జూచి పరమహర్షమున370
నింత యేటికిఁ జింత? యిది యెంత నాకు? - నంతరంగంబున ననుమానపడకు;
పరికించి ధర్మంబు పాటింతుఁ గాని కరమర్థి వ్యర్థంబు గావింప నేను;
వేయేల విభునాజ్ఞ వినఁబడకున్న - నీయాజ్ఞ గడవను నిక్కువం బరయఁ;
జారుల శీఘ్రసంచారుల ఘోట - కారూఢులుగఁ జేసి యనిచి వేవేగ
కరమర్థి నీలగ్నఘటికలయందె - భరతునిఁ బిలిపించి పట్టంబు గట్టు
మిదె యరణ్యములకు నేఁగెద" ననుచు - వదనాబ్జ మలరంగ వలఁగొని వచ్చి
తనతల్లికిని సుమిత్రావధూమణికి - జనకనందనకు నీచందమంతయును
వినుపించి వారల వెస నూఱడించి - "చనుదెంతు నోయమ్మ సందియపడకు”
మని రాజునకు మ్రొక్కి యాకైక కెరఁగి - తనుఁ గొల్చి సౌమిత్రి తగిలిరాఁ గదలి
చెలువారఁ బట్టాభిషేకంబుకొఱకు - లలి నమర్చిన మంగళద్రవ్యములకు380
నుచితప్రదక్షిణ మొనరించి చిత్త - మచలమై యవికారమై వికసింప
రాజ్యపట్టము మాని రాముండు లోక - పూజ్యుండు కాననభూమి కేగెడిని
అను మహాకలకలం బంతఃపురమున - వినఁబడ దశరథు వెలఁదులు గలఁగి
"యేభక్తి కౌసల్యయెడను గావించు - నాభక్తి మనయందు నట్ల కావించు!
నాగుణాలంకారు నామహోదారు - నాగిరివరధైర్యు నాశౌర్యధుర్యు
నాపుత్రరత్నంబు నకట! కానలకు - భూపాలుఁ డేమని పొమ్మన నేర్చె?
వీఱిడియై రాము విపినవాసమున - కాఱడిఁ బుచ్చంగ నౌ నమ్మ" యనుచు
మీఱినవగలతో మేదినీనాథు - దూఱుచు శోకింపఁ దొడఁగి రందఱును.
ఆసమయంబున నారామవిభుఁడు - కౌసల్యయింటికిఁ గడతోవ యిచ్చి
యటమున్న దొడఁగిన యభిషేకమునకుఁ - బటువిఘ్న మొరులు సంపాదింపకుండ390
జపములు శాంతులు చారుహోమములు - విపులైకనిష్ఠఁ గావించుచుఁ బ్రేమఁ
గరమర్థి నోమి మున్ గైకొన భక్తి - పరత జనార్దనుఁ బ్రార్థించుచున్న
కౌసల్య రామురాకకు సంతసిల్లి - భాసిల్లు వరపుణ్యభామలుఁ దాను
నెలమి సేనలు గొంచు నెదురుగా వచ్చి - వెలయ శుభాచారవిధు లాచరింప
నంత నాకౌసల్య యడుగుల కెఱుఁగ - సంతోషమున రామచంద్రుని నెత్తి.
యాలింగనము సేసి యాయువు యశము - భూలాభమును బొందు పుత్ర! నీ వనుచు
దీవించు తమతల్లిఁదెఱ గొప్ప రామ - దేవుఁడు వీక్షించి దీనుఁడై పలికె,
"ఏకార్యమును మీర లెఱుఁగరు తల్లి! - మీకు సుమిత్రకు మిథిలేంద్రసుతకుఁ
గడుభీతి పుట్టించు కార్యంబు పుట్టె - విడువక ధృతిఁబూని వినుము చెప్పెదను
వసుధేశుచే రెండు వరములు తొల్లి - యసమానగతిఁ గైక యాజిలోఁ బడసెఁ.400