పుట:Ranganatha Ramayanamu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యరదంబు డిగి రాముఁ డపుడు కైకేయి - వరమందిరముఁ జొచ్చి వల నొప్ప వచ్చి

శ్రీరాములు కైకయింటిలో నున్న దశరథుని జూచుట

వదనంబు వాంచి వైవర్ణ్యంబు మించి - పెదవులఁ దడపుచుఁ బెంపెల్ల నుడిగి
యుడుగక కన్నీరు లొలుక శోకాగ్నిఁ - బడి కాలు దశరథపతి చేరఁబోయి340
కరము భీతిలి మ్రొక్కి కైకకు మ్రొక్కి - కరములు ముకుళించి కడువిస్మయంబు
వెఱవెఱపాటును విహ్వలత్వంబు - వెఱపును మఱపును వీడి జోడాడ
పరిపరివిధములఁ బలుమాఱు నెమకి - పరమపుణ్యుఁడు రామభద్రుండు పలికె
“నోదేవి! యిది యేమి? యుర్వీశ్వరుండు, - నాదెసఁ జూడఁడు నాతప్పు లేమి?
యీవిన్నదనమును నిట్టిదుఃఖంబు - నీవిచారము రాజు కేమిటఁ గలిగె?"
ననవుడు నీకైక “యధిపుచందంబు - వినుపింతు నీవు గావించెదవేని?"
నని పల్క రఘురాముఁ "డది యేమి తెఱఁగు? - వినుపింపు మోయమ్మ! విశదంబు గాఁగఁ
దండ్రివాక్యములకై దారుణశిఖల - వేండ్ర మౌ నగ్నిలో విషధిలో నైనఁ
బడియెద విషమైన భక్షించువాఁడ - జడియక వినుపింపు సత్య మీమాట”
యనవుడు కైకేయి యారాముఁ జూచి - మనమునఁ గృపమాలి మఱి చెప్పఁదొడఁగెఁ350
"గరుణ దేవాసురకదనంబునందు - వరములు రెండు భూవరుఁడు నా కొసఁగె.
నవనీశు నారెండు నడిగి మాభరతు - నవనికిఁ బతి జేయు మంటి నొక్కటికి;
నెడపక పదునాలుగేండ్లు ని న్నిప్పు - డడవుల కాపుండమంటి నొక్కటికి,
ననుటయు నౌఁగాక యని యిచ్చి నీకు - వినుపింప మీతండ్రి వెఱచుచున్నాఁడు
కావున జడలు వల్కలములు గట్టి - నీ వింక తపసివై నృపవేష ముడిగి
చనుదెమ్ము దశరథజనపతి బొంకఁ - డనిపింపవలదేని యడవులనుండు
పొ"మ్మన్న విని మొగంబునఁ జిఱునవ్వు - గ్రమ్మ మాటల నొండు కపటు లేకుండఁ
గరుణయుఁ దెగువయు గరిమంబు దోఁప - పరమపుణ్యుఁడు రామభద్రుండు బలికె.
"నిటు సేయు మన్నవాఁ డినకులాధీశుఁ - డఁట నాసహోదరుం డగు రాజ్యక ర్త
యటమీఁద నీకోర్కి యడపడ నేల - కటకటా! కైకేయి కడుముగ్ధ వైతి;360
వింతమాత్రమునకై యినవంశజుండు - చింతింప నేటికిఁ జిత్తంబులోన
తనజనకునిమాట దాఁటినవాఁడు - తనయుఁడే తలపోయ దాయాదిగాక?
యేనేమి నాతమ్ముఁ డేమి యీభూమిఁ - బూనుటకును బుణ్యపురుషుఁ డై యున్న
భరతునిదెస నాకుఁ బ్రాణంబు లైన - సరకు గా వనియు రాజ్యము నాకు సరకె?”
యనవుడు ముద మంది యాకైక పలికె - "మనుజేంద్రతనయ! యామాట కే నిపుడు
భరతుని దోడ్తేరఁ బనిచెద నింక - నరుగుము వనముల కరుగునందాఁక
కుడువఁడు పలుకఁడు గూర్చుండఁ డిట్ల - పడియుండు నృపుఁ" డంచుఁ బల్కెఁ బల్కుటయు
"కటకటా తగునె యీకఠినోక్తు" లనుచుఁ - బటుమూర్ఛతో నేలఁబడియె నారాజు;