పుట:Ranganatha Ramayanamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచవల్లవములు పంచవల్కములు - పంచామృతంబులు పట్టపేనుంగు
నెనమండ్రు కన్యలు హేమఋక్షంబు -నొనర నౌదుంబరయోగ్యపీఠంబు
గంగాదితీర్ధోదకములాది గాఁగ - మంగళవస్తుసామగ్రిఁ దెప్పించి
వరరత్నభూషణావళులఁ దెప్పించి - తరమిడి వేదోక్తదానముల్ సేయ310

కైకయింటికి సుమంతుండు దశరథునిఁ బిల్వఁబోవుట

నొకలక్షకన్యల నొకలక్షగోవు - లొకలక్షయుష్ట్రంబు లొప్పఁ దెప్పించి
జపములు సేయించి శాంతి సేయించి - విపులహోమంబులు వేడ్క సేయించి
యనుపమం బగు లగ్నమాసన్నమైన - మనుజేశుఁ బిల్వ సుమంతు నంపుటయుఁ
గైకేయినగరికి గడఁకతోఁ బోయి - వాకిట నిలుచుండి వలనొప్పఁ బలికె.
“దేవ! సూర్యుఁడు పొడతెంచుచున్నాఁడు - వేవేగ మీ రట వేంచేయవలయు
శ్రీరాముపట్టాభిషేకంబు సేయ, - నారూఢమగు లగ్న మాసన్న మయ్యె.
మనుజేశ! యభిషేకమంటపంబునకు - మునులు రాజులు మహాత్ములు వచ్చినారు
పౌరులు బుధులును బంధులఁ గూడి - మీరాక గోరి యిమ్మెయి నున్నవార”
లన విని దశరథుఁ డావార్త లెల్ల - తనకుఁ గేవలమనస్తాపంబు సేయ
వనట నీవును నొంప వచ్చితే యనుచు - వినియు నిద్రించినవిధమున నుండె.320
నాసమయంబున ననియెఁ గైకేయి - “యోసుమంతుఁడ వేగ యుర్వీశుకడకు
రామునిఁ దోడ్తెమ్ము; రాజుపం” పనుడు - నామాట విని యతఁ డప్పుడే పోయి
సీతపటీరాంబుసిక్తాంగణంబు - కేతనాన్వితము నికేతనాంచితము
చందనాగరుధూపసౌరభాన్వితము - మందానిలాలోలమాలికాయుతము
ప్రతిగృహద్వారరంభాస్తంభవర్గ - మతులితమణితోరణాభిరామంబు
పౌరజనాదిసంభ్రమదుర్గమంబు - నౌ రాజమార్గంబు నపుడు గన్గొనుచు
నింద్రుగేహము హసియించు నాకిన్న - రేంద్రుమందిరముతో నీడు జోడాడి
సాంద్రవైభవరమాసహిత మౌ రామ - చంద్రుని నగరికిఁ జనుదెంచి లోన
చనువరు లై యున్న జనులచే వేగ - తనరాక యెఱిఁగించి తదనుజ్ఞ వడసి
చిత్రాఖ్యతారతో సిరు లుల్లసిల్ల - మైత్రి యొప్పెడుచందమామచందమున330
సీతాసమేతుఁడై చెలువొందు రామ - భూతలనాథునిఁ బొడ గాంచి మ్రొక్కి
"రా దేవ మిము దశరథచక్రవర్తి - యాదేవి కైకగృహంబున నుండి
యాదటఁ బిలిచి తెమ్మని పంచె"ననుడు - మోదించి చిఱునవ్వు మొలకలు నిగుడ
ధరణిజ నట నుంచి తాను లక్ష్మణుఁడు - కరమర్థి రథ మెక్కి కడఁకతోఁ గదలి
చతురంగబలము లసంఖ్యలు గొలువ - నతులవాద్యములు మిన్నంది మ్రోయంగ
వందిబృందములు కైవారము ల్సేయఁ - జెంది పుణ్యాంగన ల్సేసలు చల్ల
పురజను లానందమున జయపెట్ట - నరనాథునగరి కున్నతగతి వచ్చి