పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుచ్చుకొని, తన కొకవేళ గొప్ప యుద్యోగ మగునేమోయను నాశతో పరిపరివిధముల నాలోచించుకొనుచు మెల్లగా నింటికివచ్చెను.

తరువాత నాలుగుదినముల కొకనాఁడు ప్రభాత సమయముననే రాజుగారియింట దొంగలుపడి ధనాలయములోని నగలును రొక్క మును దోచుకొని పోయినారని యూరనొక కింవదంతికలిగెను.పిమ్మట గొంతసేపటికి రాజభటులు సందడిచేయుచు నూర నలుప్రక్కలను దిరిగి, తమకు విరోధులుగా నున్నవారి నందఱిని పట్టుకొని ఠాణా కీడ్చుకొని పోవ మొదలు పెట్టిరి; ఆక్కడ నున్నవారు వాండ్రను కొట్లలోఁ బెట్టి నేరము నొప్పుకొండని పలువిధములగొట్టి బాధింపఁ జొచ్చిరి; కాని వారు నిరపరాధుల నెందఱిని పట్టుకుని బాధపెట్టినను, నిజమయిన దొంగలను మాత్రము కనిపెట్టలేకపోయిరి. ఉత్తరపు దిక్కున కోటగోడకు నిచ్చెనవేసికొని దొంగలు లోపల ప్రవేశించినట్లు అడుగుల జాడ కనబడుచుండెను; గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడకు చిన్నతలు పెత్తుటకు తగినంత పాణిద్వార మొకటి కొట్టబడియుండెను. ఆ ద్వారమును త్రవ్వుటకు బలమయిన పనివాండ్రు ముగ్గురు పూనుకొన్నచో నధమపక్షము రెండు జాముల సేపయినను పట్టును. రాత్రి యంతసేపు మేలుకొని పనిచేయుటకు దొంగలనిద్ర యేమయిపోయినదా యని విచారింపవలసిన యక్కఱ లేదు. వారినిద్రయంతయు ద్విగుణముగా వచ్చి కావలివాండ్ర నాశ్ర యించినది. కొట్టులోపల రూపాయలసంచులు చప్పుడైనప్పుడు ధన లక్ష్మి మూలగుచున్నదని జడిసికొని కావలియున్నవారు భద్రమై గదిలో దూకి తలుపు వేసికొని ప్రాణములను కాపాడుకొనిరనియు, గ్రామములో నొకప్రవాదము పుట్టినది. ఇదెంతనిజమో యీశ్వరునకుఁ దెలియును. ఏది యెట్లయినను ధనలక్ష్మీమాత్ర మారాత్రి నరవాహనా రూఢురాలయి నూతనద్వారమున కోటవిడిచి వెళ్ళిపోయిన మాట మాత్రము వాస్తవము. ఎన్నివిధముల ప్రయత్నము చేసినను రాజ కీయభటులకు దొంగలజాడ యెక్కడను గానరానందున, విసిగి తుదకు వారు తమ నాయకుని కడకు వచ్చి తాముపడ్డ ప్రయాసము