పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుబ్ర__కోటలోనే యుండును. అక్కడ జిరకాలమునుండి నమ్మకముగాఁ బనిచేయుచున్న ముసలి బంట్లు కావలి యందురు.

నీలా__విజయనగరపు మహారాజుగారు క్రొత్తగా నొకకోటను గట్టఁదలఁచి, మేము చూచిన పట్టణములోనున్న కోటల పటములను వ్రాయించి తీసికొని రండని మఱిమఱి చెప్పినారు, మొన్ననే పెద్దా పురపు కోట పటమును దెప్పించినాము. మీరీ కోట పటమును కూడ వ్రాసి యియ్యఁగలరా?

సుబ్ర__చిత్తము. కాగితమును కలమును దెప్పింపుడు; ఇప్పడే వ్రాసి యిచ్చెదను.

అని, కాగితమును కలమును సిరాబుడ్డియు తెప్పించిన మీఁదట తాను జూచినదంతయు జ్ఞాపకమును బట్టి పటమును నీలాద్రిరాజుగారిచేతి కిచ్చెను. ఆయన దానిని జూచుకొని యాయా స్థలముల యుపయోగములను గుఱించియు పనియెుక్క- గట్టితన మును గూర్చియు ప్రశ్నలు వేయఁజొచ్చెను. సుబ్రహ్మణ్యమును దనకుఁ దెలిసినంత వఱకు సదుత్తరములను జెప్పుచు వచ్చెను.

నీలా__ఉత్తరపు వైపున వీధి ప్రక్క నున్నదేకాదా ధనాగారము?

సుబ్ర__అవును.

నీలా__ఆంతయు బాగుగ నున్నది,కాని కోటగోడ యెత్తెంత పెట్టినారు?

సుబ్ర__సుమారు పండ్రెండడుగు లుండవచ్చును.

నీలా__మన మీ కోటపటము వ్రాసికొన్న సంగతి యెవ్వరికిని దెలియనీయక రహస్యముగా నుంచవలెను, రాజులకు తమ కోట వంటిది మఱియొకటి యుండుట కిష్టముండదు.

అని చెప్పి, లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును పళ్ళెముతోఁ దెప్పించి తాంబూల మిచ్చి, "కోట కట్టించునప్పుడీపటము వ్రాసియిచ్చినది మీరే యని రాజుగారితోఁ జెప్పెదము సుండీ" యని పంపివేసెను. సుబ్రహ్మణ్యమా మాటలకు సంతోషించి సెలవు