పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నకు వెళ్ళగలరా? నిమిషములో విజయనగరపు మహారాజుగారి వద్ద గొప్పపని చెప్పించెదము. ఆయన మాకు బినతల్లి కొమారుఁడు.

ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారుఁడని చెప్పినదానికి విరుద్ధముగా నున్నందున, ఆతఁ డబద్దమాడుచున్నా డని మనసులో ననుకొనియు చెప్పినమాట మంచిది గనుక కొంచెము సంతోషించి సుబ్రహ్మణ్యము మారుపలుక కూరకుండెను.

నీలా__అనుమానించుచున్నారేమి! మీతోడు. మీకు తప్పక గొప్ప యుద్యోగము నిప్పించెదము. కాళహస్తి రాజుగారయిన రామవర్మగారికిని మాకును నత్యంత మైత్రి; చిన్నప్పుడు వారును మేమును నొక్క బండిలో నెక్కినాము. ఈ సంగతి పరమ రహ స్యము, ఎవ్వరితోను జెప్పవద్దు.

సుబ్ర__చిత్తము, ఇక్కడ పని కలిసిరాని యెడల నవశ్యముగా వెళ్ళెదను.

నీలా__మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును గాళహస్తిరాజుగారును కలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి మనకెందుకుఁగాని, అప్పుడాయన బోగముదాని నుంచు కొన్నాఁడు సుమ్మా.

సుబ్ర__తమరు ప్రొద్దుననే యక్షతలు ధరించినారు; పార్థి వము చేయుచున్నారా?

నీలా__పూర్వము పార్థివము చేయుచుంటిమి కాని యిప్పుడు శివపూజ మాత్రము చేయుచున్నాము. మీ రాజుగారుకూడ శివపూజా దురంధరులఁట కాదా? అందుచేతనే వారికి విశేషైశ్వర్యము కలిగి యున్నదని విన్నాము.

సుబ్ర__అవును. వారు శ్రీమంతులనియే నేను విన్నాను.

నీలా__మీ రాజుగారివద్ద రొక్క మేమాత్ర మున్నదని చెప్పు కొనుచున్నారు?

సుబ్ర_పదిలక్షలకు తక్కువ లేదని వాడుక.

నీలా_అది యంతయుఁ గోటలోనే గదా యుండును?