పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉమా__ఏఁడీ, నిన్ను తొందరపఱిచిన వాఁడెవ్వఁడు?

సుబ్ర__మనము మాటలాడుచుండుట చూచి మెల్లమెల్లఁగా జాఱి దూరమునుండి పారిపోవుచున్నాఁడు.

ఉమా__పోనీ, వాని సంగతి రేపు విచారించి కనుగొందము

అని మాటలాడుకొనుచు వా రిద్దఱును గలిసి యింటివంక నడచిరి. ఇల్లు చేరులోపల సుబ్రహ్మణ్యము తనతండ్రికిని కుటుంబమునకును నాఁటివఱకు సంభవించిన విపత్తులును ప్రస్తుతపు స్థితియు తానక్కడకు వచ్చిన కారణము చెప్పెను. అది విని యుమాపతిగారు మిక్కిలి వ్యసనపడి తాను చిన్నతనములో రాజ శేఖరుఁడు గారివద్దఁ జదువుకొన్నప్పుడున్న యైశ్వర్యమంతయు బోయి యింతలో నింత బీదతనము సంభవించి నందున కాశ్చర్యపడి తనకు విద్యాదానము చేసిన గురువు విషయమై శక్తివంచన లేక ప్రయత్నము చేసి చేతనయిన యుపకారమును జేయవలెనని మనసులో నిశ్చయించుకొనెను. కాబట్టి సుబ్రహ్మణ్యమును పలు విధముల నాదరించి, తాను పిఠాపురపురాజుగారియొద్ద నిరవదిరూపాయల యుద్యోగములో నున్న సంగతిని జెప్పి, అతనికింత యనుకూలమైనపని చేయించుటకై రాజుగారియొద్దఁ బ్రయత్నము చేసెద ననియు పనియైనదాక తనయింటనే యుండవలసిన దనియుఁ జెప్పెను. ఆ ప్రకారముగా ప్రతిదినమును సుబ్రహ్మణ్యము భోజనము చేసి యుమాపతిగారితోడఁ గూడ రాజసభకుఁ బోవుచుండెను. పీఠికా పరాధీశ్వరుఁ డయిన విజయ రామరాజుగా రొకనాఁడాతనిజూచి, యీయన యెవ్వరని యుమాపతిగారి నడుగగా, ఆయన వారి స్థితి గతులను మొదటనుండియుఁజెప్పి "తమ యాస్థానములో నేది యయిన నొకయుద్యోగ మీతని కిప్పింపవలయు" నని మనవి చేసెను.

ఉమాపతిగారి యింటనుండి రాజుగారికోటకుఁ బోవుమార్గములో నొక గొప్ప మేడయుండెను. ఆ మేడ నద్దెకుఁ బుచ్చుకొని నెలదినములనుండి యందులో నొక రాజుగారు తన సేవకులతోఁ గూడ కాపురముండి రెండుమూడు దినముల క్రిందట బ్రాహ్మణ