పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంత్పరణ మొకటి చేసెను. సొమ్ము లేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా భుజించుట యెల్లవారికిని సహజగుణమే కాబట్టి, ఆయూరి బ్రాహ్మణోత్తములను నిత్యము నింటికడ ఘృతము నభిఘరించు కొనువారే యయ్యును నాఁడు మాత్రము చేరల కొలఁది నేయి త్రాగిరి. ఆ సంతర్పణమువలన రాజుగారి కీర్తి గ్రామమంతటను వ్యాపించెను; కాబట్టి ప్రతిదినమును పలువురు వచ్చి యాయనను నాశ్రయించి పోవుచుండిరి. ఆయన పేరు నీలాద్రిరాజుగారు, ఒక నాఁడు నీలాద్రిరాజుగారు భోజనము చేసి వీధి యరుగుమీఁద పచారు చేయుచు నిలువఁబడి, ఆ త్రోవను రాజసభకుఁ బోవుచున్న సుబ్రహ్మణ్యమును దూరమునుండి చూచి "మాట' యని చే సైఁగజేపి పిలిచెను.

నీలా__పూర్వము మిమ్మెక్కడనో చూచునట్టున్నది. మీ కాపురపు గ్రామ మేది?

సుబ్ర__నా జన్మభూమి ధవళేశ్వరము, మా యింటి పేరు గోటేటివారు; నాపేరు సుబ్రహ్మణ్యము.

నీలా__అవును. జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరుడుగారి కొమాళ్ళు కారా? ఇప్పుడాయన యెక్కడ నున్నారు?

సుబ్ర__ఇక్కడనే భీమవరములో నున్నారు. మీ రాయన నెక్కడ నెఱుఁగుదురు?

నీలా__ధవళేశ్వరములోనే చూచినాము, మేము సంవత్స రము క్రిందట యాత్రార్థమై బయలుదేఱి పది దినములు ధవళేశ్వర ములో నుండి గౌతమీ స్నానమును చేసికొని, కోటిఫలి మొదలగు పుణ్యక్షేత్రములను సేవించుకొని, మాసము క్రిందట పాదగయను దర్శించుటకయి వచ్చి యప్పటినుండియు నిక్కడనే యున్నాము. మీ తండ్రిగారికి మా యెడల గురుభావము. మేమక్కడనున్న దినములలో మీ తండ్రిగా రెప్పడును మా యొద్దనే యుండెడివారు.

సుబ్ర__సంవత్సరము క్రిందట మిమ్ముఁ జూచినట్లు నాకు జ్ఞాపకములేదు. మీరెక్కడ బసచేసినారు?

నీలా__మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా జ్ఞాపక మున్నది. మీ కిద్దఱు చెల్లెం డ్రుండవలెను. వారు బాగున్నారా?