పుట:Raadhika Santhvanamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xii రమ్యాలోకనము

రెండుసీసములు (98 & 99). అందు “శృంగారయౌవనక్షీరాబ్ధినడుమను” అను పద్యము ముద్దుపళని గ్రంథముద్రితప్రతులలోఁ గొన్నిట నున్నది, కొన్నిట లేదు. రెండవపద్య మెందును లేదు. దీనినిఁ బట్టి చూడఁగా, పళని యాపద్యములఁ బరిహరించెననియే తోఁచుచున్నది. అది యథార్థమే యైనచో, గ్రుడ్డిలో మెల్ల, ఆమె యుచితజ్ఞత కది కొంత యూపిరి. అసలు విజయనగరప్రబంధములందు విప్రలంభశృంగారము, దక్షిణాంధ్రప్రబంధములందు సంభోగశృంగారమును బ్రాచుర్యము వహించినవి. అది యుగధర్మము.

సముఖముది జాతీయమై నుడిగారపు నునుపు దేఱిన రచన. అతని పలుకుఁబళ్లకుఁ గొన్ని మచ్చులు.

కనులఁ గప్పుక (23), దొంతర ముద్దులు (30), దురుసు పైసరములు (80), మానిసినిఁ జేసినందుకు (41), నంగనాచి (45), రుద్రాక్షపిల్లి (45), పొల మెఱుంగని నిన్నటివళికె పడుచు (49), తన్నుం దనమట్టు నెఱుఁగు (54), నమ్మి నానఁ బోసికొనియె (59), పదింబదియు గాను (60), తప్పుతంటలకు (68), వలపు వడ్డికిఁ బాఱన్ (114).

సామెతలు :- నిన్నఁ గుప్పయు నేఁ డాళ్లు (36), వ్రేలు వాచిన ఱోలంత పెరిఁగె ననిన, ఱోలు వాచిన నది యెంత పోలు (89), అల్పునకుఁ గల్మి వచ్చిన నర్ధరాత్రి, గొడుగు తెమ్మన్న కత గాను (52), కుట్ట దేలుఁ కుట్టకున్నఁ గుమ్మరబూచి (62), తిరిపెం బెత్తేవానికిఁ బెరుగుంగూ డేమి బ్రాతి (64). ఎల్లవారికి శకునంబు లెఱుఁగఁ బలికి, బల్లి తాఁ బోయి తొట్టిలోఁ బడినరీతి (72). తగిలెనా తగిలెను, తప్పెనా తప్పెను, నాతి వెఱ్ఱివాని చేతిఱాయి (59).