పుట:Neti-Kalapu-Kavitvam.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందు మాట

ఆచార్య పేర్వారం జగన్నాథం

ఉపాధ్యక్షులు

తెలుగు విశ్వవిద్యాలయం

హైదరాబాదు

నేటి కాలపు కవిత్వం అనే గ్రంధం ఆధునిక కవితా రీతులపై ఈ శతాబ్దంలో వచ్చిన తొలి గ్రంధం. ఇందువల్ల కాలికంగానూ వస్తువిషయకంగానూ ఈ గ్రంధానికి ప్రాముఖ్యం ఉన్నది. సుమారు డెబ్బై సంవత్సరాలనాడు తొలిసారి ప్రకటితమైన ఈ గ్రంథాన్ని గూర్చి ఈ తరం తెలుగు భాషాసాహిత్య విద్యార్దులకు గానీ సామాన్య తెలుగు పాఠకులకు గానీ అంతగా తెలియదు. ఈగ్రంథకర్త అయిన ఉమాకాంత విద్యాశేఖరులవారి దాడి అంతా ముఖ్యంగా భావకవిత్వాన్ని ఉద్దేశించిందే అని ఈ గ్రంథంలో ఆయన లేవనెత్తిన అంశాలద్వారా తెలుస్తున్నది. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మూడు దశాబ్దాల కాలం భావకవిత్వం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది. ఇంచుమించు ఈ శతాబ్ది మొదటి దశాబ్దం గడిచే నాటికి తెలుగు సాహిత్యంలో భావకవిత్వం కవితాకాశంలో ఇంద్రధనుస్సులాగా ఉజ్వలించింది. ఆ తర్వాత సుమారు ఒక దశాబ్దం గడిచేసరికి అత్యున్నత దశకు చేరుకున్నది మరో దశాబ్ది గడిచేసరికి క్రమంగా కళాకాంతులు కోల్పోయింది, భావకవిత్వం పరాకాష్ఠకు చేరి ఆంధ్ర దేశంలో భావకవిత్వారాధనలు విరివిగా జరుగుతున్న సమయంలో ఉమాకాంత విద్యాశేఖరుల "నేటికాలపు కవిత్వం" వచ్చింది. 1910 సంవత్సరానికి రూపురేఖలు దిద్ది తీర్చుకున్న భావకవిత్వం 1934-35 సంవత్సరాలకు తన ప్రాభవం కోల్ఫోయి వేళాకోళానికి హాస్యభాజనతకు గురి అయ్యే స్థితికి చేరుకున్నది అప్పటినుండి ఆధునిక సాహిత్యంలో అభ్యుదయ కవితా యుగం ఆరంభమైనదంటారు సాహిత్య విమర్శకులు.

అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు నవద్వీప విద్వత్పరిషత్తు సాహిత్య సదస్సులలొ పాల్గొని అక్కడి మహావిద్వాంసుల మన్నన పొందినవారు కలకత్తాలో ప్రమదనాధ తర్కవాచస్పతి వద్ద తమ సంస్కృత సాహిత్య ప్రతిభకు మెరుగులు దిద్దుకొన్నవారు అక్కడి ప్రెసిడెన్సీ కాలేజిలో ఎఫ్ ఎ చదవటానికి ఉపక్రమించినవారు 1923