పుట:Neti-Kalapu-Kavitvam.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


vii

లో ప్రారంభించి తెలుగుదేశపు వాఙ్మయ పత్రికను అత్యంత ప్రతిభావంతంగా ఒక మూడేళ్లపాటు నిర్వ హించారు. 1926లో నేటికాలపు కవిత్వం తొలి ముద్రణ వచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలొ ప్రకటించిన పాతికేళ్ల తెలుగు కవిత్వం ప్రస్తావనలో ఉమాకాంత విద్యశేఖరుల "నేటికాలపు కవిత్వం" ప్రస్తావన కూడావస్తుంది ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానం ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుచున్నాం అని ప్రస్తావించారు దేవులపల్లివారు.

వ్యాస వాల్మీకి కాళిదాస భవభూతుల సారస్వతాన్ని అధ్యయనం చేసి హృద్గతం చేసుకోకుండా భారతీయ సాహిత్య సంప్రదాయ ప్రస్థాన పరిశ్రమ లేకుండా భారతీయాలంకారిక సంప్రదాయం అలక్ష్యం చేస్తూ భావకవులు తామేదో నూతన కవితాలోకాలను ఆవిష్కరణం చేశామని స్వీయ ప్రశంసలకు పూనుకోవడం అనుచితమని "నేటికాలపు కవిత్వం" ద్వారా ఉమాకాంతంగారు ఆక్షేపించారు. ఇంగ్లీషు సాహిత్యంనుంచి ఉపజ్ఞారహితంగా అనుకరించడం తగదన్నారు. పూర్వపక్ష ప్రతిపక్ష సిద్ధాంతపూర్వకంగా తగు విమర్శసాగించారు. ఇది సంస్కృత వాఙ్మయంలోని భాష్య రచనా సంప్రదాయం తమ విమర్శను భాష్య గ్రంధమే అన్నారు విద్యాశేఖరులు.

ఆధునిక తెలుగు కవిత్వం దాని పరిణామ వికాసాలను గూర్చి నిరంతర జిజ్ఞాసతో అధ్యయన తత్పరత్వంతో కృషిని కొనసాగిస్తున్న భాషావేత్త ఆచార్య చేకూరు రామారావు ఈ కవితా విమర్శ గ్రంధానికి సంపాదకత్వం వహించడం సముచితమని తెలుగు విశ్వవిద్యాలయం భావించింది వారీ పనిని సమర్ధంగా నిర్ఫహించారు వారికి కృతజ్ఞతలు చెపుతూ సాహితీ విద్యార్దులకు ఈ గ్రంధం ఉపకరించగలదని విశ్వసిస్తున్నాను.

హైదరాబాదు. 20-4-1994

పేర్వారం జగన్నాధం